అక్రమాలపై ప్రశ్నిస్తే తప్పుడు కేసులు | - | Sakshi
Sakshi News home page

అక్రమాలపై ప్రశ్నిస్తే తప్పుడు కేసులు

May 15 2026 12:31 PM | Updated on May 15 2026 12:31 PM

● ఇసుక, గ్రావెల్‌ దందాపై నిలదీసినందుకే అరెస్టు ● వేధింపులను న్యాయపరంగా ఎదుర్కొంటాం ● కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని పరామర్శించిన కాకాణి, కిలివేటి

సూళ్లూరుపేట: కూటమి ప్రభుత్వం అవినీతి, అక్ర మాలపై ప్రశ్నిస్తున్న వైఎస్సార్‌ సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తోందని ఆ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్దన్‌రెడ్డి, సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య, పర్వతరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. వారు గురువారం నెల్లూరు సెంట్రల్‌ జైలులో ఉన్న వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి, డీసీసీబీ మాజీ చైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని పరామర్శించారు. అనంతరం కాకాణి విలేకరులతో మాట్లాడారు. సత్యనారాయణరెడ్డిని అక్రమ కేసులో అరెస్ట్‌ చేసిన ప్రభు త్వం బెయిల్‌ రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా పాత కేసులో నేరాంగీకార వాంగ్మూలం సృష్టించి పీటీ వారెంట్‌ వేసిందని విమర్శించారు. ప్రభుత్వ వేధింపులను న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. ఇప్పు డు కూటమి ప్రభుత్వ పెద్దల మెప్పు పొందేందుకు తప్పులు చేస్తున్న వారు భవిష్యత్తులో సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ప్రశ్నించే గొంతులను నొక్కేస్తారా..?

వైఎస్సార్‌ సీపీ సూళ్లూరుపేట నియోజకవర్గ నమన్వయకర్త కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అవినీతిని ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులతో నొక్కేస్తున్నారని ఆరోపించారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్‌ మాఫియా రెచ్చిపోతోందన్నారు. చివరకు రేషన్‌ బియ్యాన్ని కూడా రవాణా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇసుక రీచ్‌లో ఎమ్మెల్యే అనుచరులు బినామీల పేరుతో ఇసుక తరలిస్తుంటే అడ్డుకున్న తమ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారని వివరించారు. చంద్రబాబు, లోకేష్‌ తమ పార్టీ ఎమ్మెల్యేలపై నియంత్రణ కోల్పోయారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు చేస్తున్న అక్రమాల్లో వాటాలు తీసుకుంటూ పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ ఆగడాలు, అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రాగానే అన్నీ తిరిగి ఇచ్చేస్తామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement