ఉన్నత విద్య.. వద్దులే! | - | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్య.. వద్దులే!

May 15 2026 10:02 AM | Updated on May 15 2026 10:02 AM

ఏపీ పీజీసెట్‌కు ఆదరణ కరువు ఈ ఏడాది భారీ స్థాయిలో పడిపోనున్న పీజీ ప్రవేశాలు వర్సిటీల మనుగడ ప్రశ్నార్థకమేనా!

ఉన్నత విద్య వైపు యువత అడుగు పడడం లేదు. ఉపాధి కోర్సులైన ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ తదితర కోర్సులపై మొగ్గు చూపుతూ సంప్రదాయ కోర్సుల్లో చేరడానికి ఇష్టపడడం లేదు. ఫలితంగా ఏటా ప్రవేశాలు తగ్గుతున్నాయి. యూనివర్సిటీల్లో పలు కోర్సుల్లో సీట్లు మిగిలిపోతున్నాయి. ఇది పరిశోధనలపై ప్రభావం చూపుతోంది. సాధారణ కోర్సుల్లో ప్రవేశాలు ఇలాగే తగ్గితే విశ్వవిద్యాలయాల మనుగడ ప్రశ్నార్థకమేనని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

తిరుపతి సిటీ: రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17 విశ్వవిద్యాలయాల్లో 30 పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పీజీసెట్‌కు ఆదరణ కరువైంది. ఆశించిన స్థాయిలో అభ్యర్థులు పరీక్షకు హాజరు కాకపోవడంతో ఈ ఏడాది పలు వర్సిటీల్లో పీజీ కోర్సుల ప్రవేశాలు దారుణంగా పడిపోనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాలలో 23 పరీక్ష కేంద్రాల్లో జరిగిన ఏపీ పీజీసెట్‌–2026కు హాజరైన అభ్యర్థుల గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎస్వీయూ ఆధ్వర్యంలో ఈనెల 8 నుంచి 11వ తేదీ వరకు జరిగిన పీజీసెట్‌ పరీక్షకు 19,118 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 16,406 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్సిటీల్లో పలు పీజీ కోర్సుల్లో సుమారు 21 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉండగా 16 వేల మంది మాత్రమే పీజీసెట్‌కు హాజరుకావడంతో 6 వేలకు పైగా సీట్లు ఖాళీ ఏర్పడనున్నాయి.

రెండేళ్లుగా ఇదే పరిస్థితి..

రాష్ట్రంలో ఎంఏ, ఎమ్మెస్సీ, ఎమ్‌కాం వంటి పీజీ కోర్సులకు ఆదరణ క్రమంగా తగ్గుతోంది. 2025–26 విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 24 వేలకు పైగా పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పీజీసెట్‌–2025 పరీక్షకు 25,688 మంది దరఖాస్తు చేసుకోగా 21,995 మంది మాత్రమే హాజరయ్యారు. ఇందులో కేవలం 17 వేలు సీట్లు సైతం భర్తీ కాకపోవడం విశేషం. అలాగే ఈ ఏడాది 2026–27 విద్యా సంవత్సరంలో పీజీ ప్రవేశాల కోసం జరిగిన ప్రవేశ పరీక్షకు 19,118 మంది దరఖాస్తు చేసుకోగా 16,406 మంది మాత్రమే హాజరయ్యారు. దీంతో ఈ ఏడాది ప్రవేశాలు భారీ స్థాయిలో పడిపోనున్నాయి.

వర్సిటీల మనుగడ ప్రశ్నార్థకమేనా?

పీజీ సెట్‌కు దరఖాస్తులతోపాటు హాజరయ్యే అభ్యర్థులు క్రమంగా తగ్గిపోవడంతో వర్సిటీల భవితవ్యంపై ప్రమాదకర సంకేతాలు వెలువడుతున్నాయని మేధావులు, విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. పీజీ సెట్‌కు హాజరైన ప్రతి అభ్యర్థికి 1:1 ప్రాతిపదిక సీట్లు కేటాయించినా ఇంకా 6 వేలకు పైగా సీట్లు మిగిలిపోనున్నాయి. ప్రభుత్వం వర్సిటీలపై ప్రత్యేక దృష్టి సారించకపోవడం, నూతన విద్యావిధానంతో పీజీ కోర్సులు నిర్వీర్యం అవుతున్నాయని విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అన్ని పీజీ కోర్సుల్లో సీట్ల సంఖ్య 21 వేలు ఉండగా పీజీ సెట్‌కు హాజరైన అభ్యర్థుల సంఖ్య 16 వేలకు మించకపోవడం గమనార్హం. 2026–27 విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వర్సిటీల్లో పీజీ అడ్మిషన్లు భారీ స్థాయిలో పడిపోనున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో వర్సిటీల భవితవ్యం ప్రశ్నార్థకమేనని మేధావి వర్గాలు, విద్యానిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సీట్లు 21వేలు.. అభ్యర్థులు 16వేలు

పరిశోధన రంగంపై తీవ్ర ప్రభావం

పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పడిపోవడం పరిశోధన రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నిర్వహించే ఆర్‌సెట్‌కు ఈ ఏడాది దరఖాస్తులు తగ్గే అవకాశం ఉంది. ఆధునిక యువత టెక్నికల్‌, మెడికల్‌ రంగం వైపు మొగ్గు చూపడం. యూజీ పూర్తి చేసిన వెంటనే అతిచిన్న వయస్సులోనే ఉపాధి, ఉద్యోగావకాశాలను దక్కించుకోవాలనే లక్ష్యంతో యువత అడుగులు వేయడంతో పీజీల్లో ప్రవేశాలు తగ్గుతున్నాయి. దీంతో రీసెర్చ్‌ రంగంపైనా యువత పెద్దగా మొగ్గు చూపలేకపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉన్నత విద్యకు యువత దూరమయ్యే ప్రమాదం పొంచిఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రెండేళ్లుగా పీజీ సెట్‌ పరిస్థితి ఇదీ

కోర్సుల వివరాలు 2025లో దరఖాస్తులు హాజరైన 2026లో దరఖాస్తులు హాజరైన

వారి సంఖ్య వారి సంఖ్య

కెమికల్‌ సైన్స్‌ 6,070 5,396 3,581 3,150

లైఫ్‌ సైన్స్‌ 4,027 3,641 3,260 2,947

కంప్యూటర్‌ 2,333 1,858 1,884 1,521

కామర్స్‌ 1,438 1,203 980 834

ఇంగ్లీష్‌ 898 721 746 607

హ్యుమానిటీస్‌ 883 736 634 510

జువాలజీ 1,548 1,347 1,221 1,055

గణితం 1,175 983 835 721

ఫిజిక్స్‌ 938 808 653 562

బోటనీ 1,295 1,146 1,012 873

మిగిలిన కోర్సులు 5,083 4,156 4,312 3,626

మొత్తం 25,688 21,995 19,118 16,406

Advertisement
 
Advertisement
Advertisement