తిరుపతి సిటీ: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ పాపం మోదీ ప్రభుత్వానిదేనని, అవినీతిలో కూరుకుపోయిన ఎన్‌టీఏ సంస్థను రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఎమ్మార్ పల్లి సర్కిల్‌లో ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేసి, ఎన్‌టీఏకి సంబంధించిన ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏర్పడిన నాటి నుంచి పరీక్షల నిర్వహణలో తన అసమర్థతను నిరంతరం చాటుకుంటూనే ఉందని, పేపర్ లీకేజీలతో నీట్ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను రోడ్డున పడేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 720 మార్కుల్లో దాదాపు 600 మార్కుల ప్రశ్నలు లీక్ అయ్యాయని, పరీక్షలోని మొత్తం 180 ప్రశ్నల్లో 15 ప్రశ్నలు ముందుగానే బయటకు రాగా, కెమిస్ట్రీ విభాగంలోని సుమారు 120 ప్రశ్నలు యథాతథంగా లీక్ అవడం దారుణమన్నారు. రూ.కోట్లు చేతులు మారి, అర్హులైన పేద విద్యార్థులకు అన్యాయం చేసేలా ఈ కుంభకోణం సాగిందని మండిపడ్డారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో వైద్య విద్యలో యూజీ ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షలను అస్తవ్యస్తం చేసిన మోదీ ప్రభుత్వమే ఈ వైఫల్యానికి బాధ్యత వహించాలన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల విద్యా ప్రమాణాలు, అవసరాలను విస్మరించి, పరీక్ష విధానాన్ని కావాలని కేంద్రీకరించడంతోనే ఇలాంటి భారీ అవినీతికి ఆస్కారం ఏర్పడిందన్నారు. కేంద్రీకరణ విధానం దేశవ్యాప్తంగా ’ఎగ్జామ్ మాఫియా’ పుట్టుకొచ్చేలా చేసిందని, ఒకవైపు సామాన్య మధ్యతరగతి విద్యార్థులను కోచింగ్ సెంటర్ల దోపిడీకి గురిచేస్తుండగా, మరోవైపు లీకుల ద్వారా విద్యార్థులను అభద్రతాభావంలోకి నెట్టేస్తుందన్నారు. ఈ పేపర్ లీక్ వెనుక ఉన్న సూత్రధారులపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపి, కఠినంగా శిక్షించి, ఎన్టీఏ నిర్లక్ష్యంతో విద్యార్థులు పడిన మానసిక వేదనకు, వారు చేసిన ఖర్చులకు ఎన్టీఏ తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండి చలపతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి కుమార్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షకార్యదర్శులు పవిత్ర, అక్బర్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉదయ్ కుమార్, సి ప్రవీణ్ కుమార్, నాయకులు వినయ్, తేజ, అనిత, ఓంరాజ్, చరణ్, రెడ్డికుమార్, మహేష్, నవీన్ పాల్గొన్నారు.


