చంద్రగిరి: గుండెపోటుతో జూనియర్ లైన్‌మన్ మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. చంద్రగిరి రూరల్ సెక్షన్ రామచంద్రాపురం మండలం అనుప్పల్లిలో జూనియర్ లైన్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న రవీంద్ర(43) ఇటీవల శిక్షణ నిమిత్తం నెల్లూరుకు వెళ్లి, అక్కడ శిక్షణ పొందుతున్నాడు. బుధవారం ఉదయం గుండెనొప్పిగా ఉందనడంతో సహచరులు ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే మృత్యువాత పడ్డాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న చంద్రగిరి అధికారులు ఆయన మృతిపై దిగ్భ్రాంతికి లోనయ్యారు. బుధవారం ఆయన స్వగ్రామం మదనపల్లి సమీపంలోని ఉప్పరపల్లిలోని స్వగ్రామానికి తరలించి, అంత్యక్రియలను పూర్తి చేశారు.
తయారీ రంగంలో తిరుపతికి ఉన్నత స్థానం
తిరుపతి అర్బన్: తయారీ రంగంలో రాష్ట్రంలో తిరుపతి జిల్లా ఉన్నత స్థానంలో ఉందని పరిశ్రమల, వాణిజ్యశాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, నగరపాలక సంస్థ ఇన్‌చార్జి కమిషనర్ శారదాదేవి, డీఆర్వో నరసింహులతో కలసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌లో వ్యవసాయం, పరిశ్రమలు సేవారంగంలోకి మారాలని సూచించారు. సేవారంగాల వాటా ఎక్కువగా ఉంటేనే పెట్టుబడులు ఉపాధిగా మారి ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అలాంటి సామర్థ్యం తిరుపతి జిల్లాకు ఉండడం సంతోషంగా ఉందన్నారు. నిత్యం తిరుమల దర్శనానికి వేల సంఖ్యలో ప్రజలు తిరుపతి నగరానికి వస్తుంటారని..వారంతాసేద తీరేలా సమయం చేకూర్చే ఆ దిశగా ఆలోచన చేయాలన్నారు. జిల్లాలోని పరిశ్రమలను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి పథంలో జిల్లాను నడపాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు.


