79 మంది గైర్హాజరు
తిరుపతి సిటీ: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా శుక్రవారం జరిగిన మొదటి సంవత్సరం హిస్టరీ, బోటనీ పేపర్–1 (బ్యాక్‌లాగ్) పరీక్షలకు 79 మంది గైర్హాజరైనట్లు ఆర్‌ఐఓ జి రాజశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 44 పరీక్ష కేంద్రాల్లో జరిగిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయన్నారు. ఈ పరీక్షలకు 804 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 725 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. అలాగే ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు 14 సెంటర్లలో పరీక్ష జరుగ్గా 1,342 మంది విద్యార్థులకు గాను 1,240 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. అలాగే శనివారం సెంకడ్ ఇయర్ విద్యార్థులకు బోటనీ పేపర్–2, హిస్టరీ పేపర్–2 పరీక్షలు జరుగుతాయని తెలిపారు.
పనులు వేగవంతం చేయండి
తిరుపతి అర్బన్: ప్రాధాన్యత కలిగిన అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ నుంచి జేసీ గోవిందరావు, నగరపాలక కమిషనర్ మౌర్య, డీఆర్వో నరసింహులు, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, డీపీఓ సుశీలాదేవితో కలసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వారం పనుల్లో పురోగతి చూపాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిడ్కో ఈఈ దేవిక, సీపీఓ రాజశేఖర్, కలెక్టరేట్ ఏఓ రామాంజుల నాయక్ తదితరులు పాల్గొన్నారు.
బీఈడీ పరీక్ష ఫలితాలు విడుదల
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన బీఈడీ థర్డ్ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను శుక్రవారం విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ రాజామాణిక్యం తెలిపారు. ఫలితాల కోసం విద్యార్థులు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. అలాగే రీవ్యాలేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు వచ్చే నెల 11వ తేదీలోపు అప్‌లై చేసుకోవాలని ఆయన సూచించారు. అలాగే గత ఏడాది ఏప్రిల్లో జరిగిన ఎంఎస్సీ ద్వితీయ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను సైతం విడుదల చేసినట్టు తెలిపారు
విద్యార్థిని ఒకటే..
విధులు పది మందికి..
పుల్లంపేట: చైనా ప్రభుత్వం ఒక్క విద్యార్థి చదువు కోసం నాలుగేళ్లు రైలు నడిపిందని ఓ సినిమాలో హీరో డైలాగ్ చెప్పడం అందరికీ గుర్తువుండే ఉంటుంది. అదే తరహాలో శుక్రవారం మండల కేంద్రంలోని ఎస్‌బీవీడీ సభా జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంగా నిర్వహిస్తున్న ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు ఒకే ఒక విద్యార్థినికి పరీక్ష నిర్వహించారు. స్థానిక మోడల్ స్కూల్‌కు చెందిన ద్వితీయ సంవత్సరం విద్యార్థిని దీపిక గతేడాది ప్రథమ సంవత్సరం పరీక్షల్లో బోటనీ పరీక్ష ఫెయిల్ అయ్యింది. ఈ ఏడాది బోటనీ సిలబస్‌లో మార్పులు జరగడంతో విద్యార్థినికి పాత సిలబస్ ప్రకారం పరీక్ష నిర్వహించాల్సి వచ్చింది. దీంతో ఆమె ఒక్కరికే పరీక్ష నిర్వహించారు. ఓ డిపార్ట్‌మెంట్ అధికారి, చీఫ్ సూపరింటెండెంట్, అదనపు సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్, ఆఫీస్‌క్లర్కు, వైద్యసిబ్బంది, పోలీసు, మహిళా వాచ్‌మన్, అటెండర్ తదితరులు ఒక్కరి కోసం విధులు నిర్వర్తించారు.


