తొలి పరీక్ష ప్రశాంతం | - | Sakshi
Sakshi News home page

తొలి పరీక్ష ప్రశాంతం

Feb 24 2026 7:52 AM | Updated on Feb 24 2026 7:52 AM

తొలి పరీక్ష ప్రశాంతం

తొలి పరీక్ష ప్రశాంతం

● ఇంటర్‌ ఫస్టియర్‌ లాంగ్వేజ్‌ పరీక్షలకు 797 మంది గైర్హాజరు ● పరీక్ష కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు ● నేటి నుంచి సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు ప్రారంభం

తిరుపతి సిటీ: జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 84 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ తెలుగు, సంస్కృత భాషా పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పరీక్ష కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి విద్యార్థులు, తల్లిదండ్రుల సందడి కనిపించింది. కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తిరుపతిలోని పలు పరీక్ష కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఏర్పాటు చేసిన మౌళిక సదుపాయాలపై ఆయన ఆరా తీశారు. జిల్లాలోని ప్రతి పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి విద్యార్థులన తనిఖీ చేసి అనుమతించారు.

తొలిరోజు పరీక్షకు 797మంది గైర్హాజరు

జిల్లా వ్యాప్తంగా ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతన్న జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థులు తొలిరోజు తెలుగు, ఇంగ్లీష్‌ పరీక్షకు 31,014 మంది హాజరుకావాల్సి ఉండగా 30,217మంది హాజరయ్యారని ఆర్‌ఐఓ కార్యాలయం తెలిపింది. ఇందులో 797మంది గైర్హాజరైనట్లు తెలుస్తోంది. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, విద్యుత్‌ సరఫరా, మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు.

3 గంటల పాటు పడిగాపులు

తమ పిల్లలను పరీక్ష కేంద్రాల వద్దకు తీసుకువచ్చిన తల్లిదండ్రులు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు సుమారు 3గంటల పాటు పడిగాపులు కాశారు. పరీక్ష కేంద్రాల బయట చెట్ల కింద, సమీపంలో దుకాణాల వద్ద, ఫుట్‌పాత్‌లపైన నిరీక్షిస్తూ ఉండిపోయారు. ఎండ తీవ్రతను సైతం లెక్క చేయకుండా తమ పిల్లల కోసం వేచి ఉన్నారు.

నేటి నుంచి సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు ప్రారంభం

ఇంటర్మీడియట్‌ సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులకు మంగళవారం నుంచి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–2లో భాగంగా తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ పరీక్ష జరగనుంది. జిల్లా వ్యాప్తంగా 84 పరీక్ష కేంద్రాల్లో 30,696 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్న పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ అధికారులు తెలిపారు. మార్చి 23వ తేదీ వరకు సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు కొనసాగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement