పాఠ్యాంశాల్లో కృత్రిమ మేధను చేర్చాలి
తిరుపతి సిటీ: భౌగోళిక పాఠ్యాంశాలలో కృత్రిమ మేధస్సును అనువర్తింపచేయాల్సిన అవసరం ఉందని ఎస్వీయూ వీసీ టాటా నర్సింగరావు అభిప్రాయపడ్డారు. ఎస్వీయూ భూగోళశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘సుస్థిర అభివృద్ధి – వికసిత్ భారత్ కోసం నీరు, నేల వనరుల నిర్వహణలో జియోస్పేసియల్ టెక్నాలజీస్‘ అనే అంశంపై మూడు రోజుల పాటు జరగనున్న అంతర్జాతీయ సదస్సు సోమవారం సెనేట్ హాల్‌లో ప్రారంభమైంది. దీనికి వీసీ ముఖ్యఅతిథిగా విచ్చేసి అతిథులు, అధ్యాపకులతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నీటి కొరత, నేల క్షీణత, వాతావరణ మార్పు, స్థిరమైన వనరుల నిర్వహణ వంటి సమకాలీన సవాళ్లను పరిష్కరించడంలో జియోస్పేసియల్ టెక్నాలజీ ప్రధాన భూమిక పోషిస్తున్నాయని తెలిపారు. పోటీ ప్రపంచానికి దీటుగా 3డీ మ్యాపింగ్, స్పేసియల్ మోడలింగ్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్, ఉపగ్రహ డేటా వివరణలో విద్యార్థులను సన్నద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అనంతరం దక్షిణ బిహార్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ ఆచార్య కామేశ్వర్‌నాథ్ సింగ్ వికసిత్ భారత్‌ను సంభావితం చేయడానికి నేల, నీటి వనరుల శాసీ్త్రయ నిర్వహణ ద్వారా ఆహార భద్రతను నిర్ధారించడానికి ఇటువంటి సదస్సులు అవసరమని పేర్కొన్నారు. ఈ సదస్సులో డీజీఎస్‌ఐ అధ్యక్షులు ప్రొఫెసర్ దీపేంద్రనాథ్, సెక్రటరీ జనరల్ బీసీ వైద్య, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, సీడీసీ డీన్ ప్రొఫెసర్ చంద్రాయుడు, అధ్యాపకులు, పరిశోధకులు, పలు ప్రాంతాల నుంచి విచ్చేసి ప్రతినిధులు పాల్గొన్నారు.


