విద్యుత్ సమస్యల పరిష్కారం వేగవంతం
తిరుపతి రూరల్: విద్యుత్ వినియోగదారుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం సోమవారం నిర్వహించిన డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమానికి 59 వినతులు అందినట్లు తెలిపారు. తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. ఆ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత నోడల్ ఆఫీసర్లను ఆయన ఆదేశించారు. వినియోగదారులు విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్లు 1912 లేదా 1800 425 155333కు కాల్ చేయడం లేదా వాట్సాప్ నంబర్ 9133331912కు చాట్ చేయడం ద్వారా విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు పి.అయూబ్ ఖాన్, కె.గురవయ్య, కె.రామమోహన్ రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు జె.రమణాదేవి, ఆర్. పద్మ, కె. ఆదిశేషయ్య, ఎం. ఉమాపతి, ఎం. మురళీ కుమార్, ఎం. కృష్ణారెడ్డి, సీహెచ్ రామచంద్రరావు, కె. సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


