పట్టపగలే నగల చోరీ
పాకాల: పట్టపగలే రోడ్డు పక్కన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడిన సంఘటన మండలంలోని నేండ్రగుంటలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానిక పోలీసుల కథనం మేరకు.. నేండ్రగుంటకు చెందిన రవి ఇంటికి తాళం వేసుకుని మధ్యాహ్నం సుమారు 12.30 నుంచి 1.30 గంటల ప్రాంతంలో తన కుమారుడి షాపు వద్దకు వెళ్లాడు. అలాగే ఆ ఇంటిపైన అద్దెకు ఉన్న వాసు ఇంటికి తాళం వేసుకుని దైవదర్శనం కోసం కాణిపాకం వెళ్లాడు. వాసు వినాయకస్వామి దర్శనం ముగించుకుని స్కూటర్‌లో ఇంటి వద్దకు రావడంతో దుండగులు మొదటి అంతస్తు నుంచి దూకి పారిపోవడం గమనించాడు. వాసు ఇంటిపైకి వెళ్లి చూడగా ఇంటి తాళాలు పగల గొట్టి ఉండడం గుర్తించారు. రవి ఇంట్లో తాళాలు పగలగొట్టి బీరువాలోని బంగారు నెక్లెస్, కమ్మలను చోరీ జరిగినట్లు గుర్తించారు. ఈ విషయమై పాకాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ సుదర్శన్ ప్రసాద్ ఇళ్లను పరిశీలించారు. ఈ మేరకు ఎస్‌ఐ తరుణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


