ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
భాకరాపేట: భాకరాపేట అటవీశాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో సుమారు రూ.35 లక్షల విలువైన 763 కిలోల ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. అధికారుల కథనం మేరకు.. చిన్నగొట్టిగల్లు మండలంలోని శేషాచల అడవుల్లో భాకరాపేట అటవీశాఖాధికారులు శుక్ర వారం ఉదయం కూంబింగ్ చేశారు. ఆ సమయంలో అనుమానాస్పద వాహనం వస్తుండగా ఆపారు. అయితే డ్రైవర్ తప్పించుకునేందుకు యత్నించగా సిబ్బంది వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు. వాహనంలో తనిఖీ చేయగా సుమారు 763 కిలోల ఎరచ్రందనం దుంగలు ఉండగా స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ సుమారు రూ.35 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఘటనకు సంబంధించి వాహన డ్రైవర్‌తోపాటు మరో ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
భక్తుల సేవే మహద్భాగ్యం
తిరుమల: శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే మహాద్భాగ్యం కలగడం చాలా ఆనందంగా ఉందని టీటీడీ నూతన ఈఓ ముద్దాడ రవిచంద్ర తెలిపారు. శ్రీవారి ఆలయంలో ఆయన శుక్రవారం ఉదయం టీటీడీ ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. తరువాత టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందుగా ఆయన క్షేత్ర సంప్రదాయం పాటిస్తూ వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నూతన ఈఓకు అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. బాధ్యతలు స్వీకరణ అనంతరం ఆయనకు పండితులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
నులిపురుగుల నివారణకు అల్బెండజోల్
తిరుపతి అర్బన్: నులిపురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలను పిల్లలకు ఇవ్వాలని డీఆర్వో నరసింహులు తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన వర్చువల్ పద్ధతిలో అన్ని విభాగాలకు చెందిన అధికారులతో నులిపురుగుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ నెల 17న నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని వెల్లడించారు. డీఎంఅండ్ హెచ్‌వో బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ పిల్లల్లో రక్తహీనత తగ్గడమే కాకుండా, వారి శారీరక, మానసిక ఎదుగుదల మెరుగుపడుతుందని తెలిపారు. జిల్లాలో మొత్తం 4,97,311 మందికి అల్బెండజోల్ మాత్రలు ఇవ్వాలనే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఎర్రచందనం కేసులో
ఇద్దరికీ ఐదేళ్ల జైలు
తిరుపతి లీగల్: ఎర్రచందనం కేసులో ఇద్దరికీ ఐదేళ్లు చొప్పున జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.6 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పినట్టు ఫారెస్ట్ సిబ్బంది తెలిపారు. శేషాచలం అటవీ ప్రాంతం, కరకంబాడి బీట్ ప్రాంతం 2016లో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం తనిఖీలు చేసింది. తమిళనాడు, తిరువణ్నామలై జిల్లాకు చెందిన శివమూర్తి సేతు, తిరుపతి శివమణి అటవీ ప్రాంతంలో అక్రమంగా సంచరించడాన్ని గుర్తించి, ఇద్దరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఇద్దరిపై నేరం రుజువు కావడంతో ఇద్దరికీ శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
ఆర్టీసీ అధికారుల పరిశీలన
నాయుడుపేటటౌన్: మండలంలోని విన్నమాల సమీపంలో ఆర్టీసీ బస్సులో వెనుక నుంచి మంటలు చేలరేగిన సంఘటనకు సంబంధించి శుక్రవారం ఆర్టీసీ అధికారులు పరిశీలించారు. వినుకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గురువారం రాత్రి 29 మంది ప్రయాణికులతో తిరుపతి నుంచి వినుకొండకు వెళుతుండగా విన్నమాల వద్దకు వచ్చే సరికే బస్సు వెనుక వైపు ఒక్కసారిగా మంటలు చేలరేగిన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి తిరుపతి జిల్లా ఆర్టీసీ ఆర్‌ఎం జగదీష్‌తోపాటు సూళ్లూరుపేట డిపో మేనేజర్ కళ తదతరులు, మెకానిక్ బృందంతో బస్సును పరిశీలించారు.
రక్షణ విజ్ఞాన సదస్సులో ఎస్వీయూ వీసీకి గౌరవ ఫెలోషిప్
తిరుపతి సిటీ: విజయవాడ వేదికగా జరిగిన రక్షణ విజ్ఞాన సదుస్సులో ఎస్వీయూ వీసీ టాటా నర్సింగరావుకు అరుదైన గౌరవం లభించింది. అకాడమి ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్(ఏఎస్‌టీసీ) ఎన్‌ఆర్‌ఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఈ సదస్సులో ఆయనకు ఏఎస్‌టీసీ గౌరవ ఫెలోషిప్‌ను ప్రకటించింది.
ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు


