గంజాయి కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు
సూళ్లూరుపేట: స్థానిక పోలీస్‌స్టేషన్‌లో 2018 సెప్టెంబర్ 10న నమోదైన గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరు నిందితులకు పదేళ్ల కఠిన కారాగారశిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ జిల్లా ఏడీజే కోర్టు న్యాయమూర్తి జీ గీత గురువారం తీర్పు చెప్పారని సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ తెలిపారు. తమిళనాడులోని సేలం జిల్లా పెదనాయకంపాళెం తాలూకా, ఎరివలవూరుకు చెందిన ఆర్ మహాదేవన్ (24), అదే జిల్లా, తాలూకాలోని పూడూర్ గ్రామానికి చెందిన పీ వెంకటేష్ (23)ను గంజాయి అక్రమ రవాణాకేసులో అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. పోలీస్ అధికారులు ఆ కేసుకు సంబంధించి సాక్ష్యాధారాలు సేకరించి, ప్రాసిక్యూషన్ తరుఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్‌కే రఫీ మాలిక్‌కు అందజేయడంతో ఆయన వాదనలు వినిపించి నేరం రుజువు చేశారు. దీంతో గురువారం నిందితులకు జైలు, జరిమానా విధిస్తూ ఫస్ట్‌క్లాస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి జీ గీత తీర్పు చెప్పారని సీఐ తెలిపారు.
కరెంట్ షాక్‌తో యువకుడి మృతి
ఏర్పేడు: పచ్చిగడ్డి కోస్తుండగా, గట్టుపై పడి ఉన్న 11కేవీ విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురై ఓ యువకుడు దుర్మరణం చెందిన సంఘటన కుప్పయ్యకండ్రిగలో గురువారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. ఏర్పేడు మండలం కుప్పయ్యకండ్రిగకు చెందిన ఆరూరు కేశవులు కుమారుడు ఆరూరు వెంకటరమణ అలియాస్ అజయ్‌కుమార్ (22) డిగ్రీ చదువుతున్నాడు. ఖాళీగా ఉన్న సమయంలో పొలం పనులు, ఇంటి పనులు చేస్తూ కుటుంబానికి కొంత ఆసరాగా ఉంటున్నాడు. వీరికి ఉన్న రెండు ఆవులను మేపటానికి గురువారం గ్రామానికి సమీపంలోని బీడు భూములకు తోలుకెళ్లాడు. ఆవులు మేస్తుండగా, పక్కనే ఉన్న పంట పొలాల గట్లపై ఉన్న పచ్చిగడ్డిని కొడవలిలో కోస్తుండగా, 11కేవీ ట్రాన్స్‌ఫార్మర్ విద్యుత్ తీగ తెగి గట్టుపై పడి ఉండగా, గడ్డిని కోస్తూ అతను విద్యుత్ తీగను పట్టుకోవడంతో షాక్‌కు గురై అపరస్మారక స్థితికి చేరుకున్నాడు. అతనిని స్థానికులు గుర్తించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
గంజాయి కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు


