అవినీతి అధికారుల్లో అలజడి
సైదాపురం: మ్యూటేషన్ పనుల్లో మాయజాలం ప్రదర్శించిన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పని చేసిన రెవెన్యూ అధికారులకు ప్రభుత్వం నుంచి నోటీసులు జారీ కావడంతో జిల్లాలో అలజడి నెలకొంది. ఏకంగా ఏడుగురు తహసీల్దార్లు, ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్లతోపాటు ముగ్గురు వీఆర్వోలకు, ఒక్క సర్వేయర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ బుధవారం ఆదేశాలు రావడంతో రెవెన్యూ అధికారుల్లో కలవరం మొదలైంది. 2022 జూలై 2, 3 తేదీల్లో ఉమ్మడి జిల్లాల పరిధిలో ఏకకాలంలో 16 మంది నెల్లూరు జిల్లా ఏసీబీ అధికారులు సైదాపురం తహసీల్దార్ కార్యాలయంపై దాడులు చేసి, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
ప్రభుత్వ ఆదేశాలతో అధికారుల్లో అలజడి
2022లో ఏసీబీ దాడుల నివేదిక ఆధారంగా ప్రభుత్వం అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారుల్లో అలజడి మొదలైంది. ఆ అధికారుల జాబితాలో ఉన్న శ్రీనివాసరావు ప్రస్తుతం చిల్లకూరు తహసీల్దార్‌గా విధులను నిర్వర్తిస్తున్నారు. ఈనెల 30వ తేదీన ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు. అలాగే ఎంవీ సుధాకర్‌రావు, మునిలక్ష్మి, కాయల సతీష్ ఉద్యోగ విరమణ చేశారు. ఇతర జిల్లా నుంచి 2019లో ఎన్నికల సమయంలో వచ్చిన వి కోటేశ్వరరావు ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్తుతం పాలకృష్ణ, కె.జయజయరావు విధుల్లో కొనసాగుతున్నారు. ఆ సమయంలో డీటీలుగా విధులు నిర్వహించిన విజయలక్ష్మి ప్రస్తుతం బాలాయపల్లి తహసీల్దార్‌గా ఉన్నారు. అలాగే కిషోర్‌రెడ్డి కూడా ఉన్నారు. సర్వేయర్ హజరత్తయ్య ఇటీవలే మృతి చెందారు. వీఆర్వోలు రమాదేవి, హరిబాబు, మునిబాబు విధుల్లో ఉన్నారు. వీరంతా పదిరోజుల్లో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాల్సి ఉంది. లేని పక్షంలో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తప్పవంటూ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
14400కు ఫిర్యాదుతో దాడులు
మండలంలో పేదలకు అందాల్సిన ప్రభుత్వ భూములను ముగ్గురి పేర్లతో ఒకే ఏడాదిలో మ్యుటేషన్ చేసి యాజమాన్య హక్కులు కల్పించే ప్రయత్నం, అగ్రిమెంట్లు చేసుకున్న భూములకు పట్టాదారుపాసుపుస్తకాలు ఇవ్వడం లాంటివి గోల్‌మాల్ చేయడంతో కొంత మంది బాఽధితులు ప్రభుత్వ ట్రోల్ ఫ్రీ 14400కు ఫిర్యాదులు చేశారు. దీంతో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. డిజిటల్ కీని దుర్వినియోగం చేయడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి కూడా భారీ గండిపడినట్లు వారి పరిశీలనలో వెల్లడైంది. ప్రధానంగా భూమి రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండానే భూమార్పిడి చేయడంతో పాటు 22ఏ జాబితాలో ఉన్న భూములను కూడా పట్టాదారు పాసుపుస్తకాలను అందించారని ఏసీబీ అధికారులు గుర్తించారు.


