సోలార్ వెలుగుల్లో గ్రామీణం
తిరుపతి రూరల్ : గ్రామీణ ప్రాంతాలను సోలార్ వెలుగుల్లోకి తీసుకురానున్నట్లు ఏపీ ఎస్పీడీసీఎల్ ఎండీ శివశంకర్ తెలిపారు. సోమవారం ఎస్పీడీసీఎల్ కార్యలయంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ ఇండియన్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి 5 జాతీయ అవార్డులను అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. దేశంలోని 54 విద్యుత్ సంస్థల్లో ఏపీ ఎస్పీడీసీఎల్ 27వ ర్యాంకుతో గ్రేడ్–బిలో స్థానం దక్కించుకోవడం గర్వకారణమని, సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని వివరించారు.
2.07లక్షల రూఫ్‌టాప్ ప్లాంట్లు
ఎస్పీడీసీల్ పరిధిలో 2.07 లక్షల ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఒక్కో గృహానికి 2 కిలోవాట్ల చొప్పున మొత్తం 415 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పీఎం సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన పథకం కింద ఇప్పటి వరకు 16 వేల రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేయడం ద్వారా 60 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతోందని వెల్లడించారు.
ఉత్తమ సేవలకు ప్రశంస
విధి నిర్వహణలో ప్రతిభ కనబరచిన ఉద్యోగులకు, బెస్ట్ సర్కిల్, బెస్ట్ డివిజన్, బెస్ట్ సబ్–డివిజన్, బెస్ట్ సెక్షన్లకు సీఎండీ శివశంకర్ ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు ప్రదానం చేశారు.వీరిలో చీఫ్ జనరల్ మేనేజర్లు ఎం. మురళీ కుమార్, ఎన్. శోభావాలెంటీనా, జనరల్ మేనేజర్లు టీఎస్. రాజశేఖర్ రెడ్డి, జి. చక్రపాణి ఉన్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు కె. గురవయ్య, పి. అయూబ్ ఖాన్, కె. రామమోహన్ రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు జె. రమణాదేవి, ఆర్. పద్మ, పీహెచ్ జానకిరామ్, కె. ఆదిశేషయ్య, ఎం. ఉమాపతి, ఎం.కృష్ణా రెడ్డి, జాయింట్ సెక్రటరీ యం. గోపాలకృష్ణ, చీఫ్ విజిలెన్‌న్స్ ఆఫీసర్ కె. జనార్ధన్ నాయుడు, సీజీఆర్‌ఎఫ్ చైర్ పర్సన్ ఎ. శ్రీనివాస ఆంజనేయమూర్తి పాల్గొన్నారు.
సోలార్ వెలుగుల్లో గ్రామీణం


