మది.. చెదిరినది
స్వర్ణముఖి నదిని భారీ యంత్రాలతో తోడేస్తున్న ఇసుకాసురులు నది పొర్లు కట్టలు సైతం ధ్వంసం రహస్య ప్రదేశాల్లో నిల్వ.. దర్జాగా అక్రమ రవాణా భారీ వర్షాలు వస్తే గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం అధికార పార్టీ నేతల పేరు చెప్పి బెదిరింపులు
స్వర్ణముఖి నదిని కుళ్లబొడిచేస్తున్నారు. భారీ యంత్రాలతో తవ్వేసి ఇసుకను అక్రమంగా తరలించేస్తున్నారు. నది చుట్టూ పొర్లు కట్టలను ధ్వంసం చేసి రవాణాకు మార్గం ఏర్పాటుచేసుకుని ట్రాక్టర్లు, భారీ వాహనాల్లో రవాణా చేస్తున్నారు. రహస్య ప్రదేశాల్లో నిల్వ ఉంచి అక్కడి నుంచి తమిళనాడు సరిహద్దు ప్రాంతాలకు దర్జాగా తరలిస్తున్నారు. భారీ వర్షాలు వస్తే పొర్లు కట్టలు తెగ్గిట్టిన ప్రాంతాల నుంచి వరద నీరు గ్రామాలను ముంచెత్తుతుందని సమీప పల్లెల ప్రజలు భయపడుతున్నారు. అధికార పార్టీ నాయకులే ఇసుకాసురులుగా మారడంతో అధికారులు పట్టించుకోవడం లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాయుడుపేట టౌన్: స్వర్ణముఖి నది నుంచి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇసుకాసురులు ఖాతరు చేయడం లేదు. నాయుడుపేట మండల పరిధిలోని అయ్యప్పరెడ్డి పాళెం సమీపంలో స్వర్ణముఖి నది నుంచి ప్రతిరోజు ట్రాక్టర్లలో అధిక సంఖ్యలో తమిళనాడు సరిహద్దు ప్రాంతాలకు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. స్వర్ణముఖి నదిలో తవ్వేసిన ఇసుకను రహస్య ప్రదేశాల్లో నిల్వ ఉంచుతున్నారు. అక్కడి నుంచి పట్టపగలే దర్జాగా టిప్పర్లలో తమిళనాడు ప్రాంతానికి రవాణా చేస్తున్నారు. భారీ యంత్రాలతో తవ్వేయడంతో పలుచోట్ల స్వర్ణముఖి నదిలో అగాధాలు ఏర్పడ్డాయి.
ముంపునకు గురయ్యే ప్రమాదం
ఇసుక అక్రమ రవాణా కోసం స్వర్ణముఖి నది పొర్లు కట్టలను ధ్వంసం చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. భారీ వర్షాలు కురిస్తే పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తే సమీప గ్రామాలు ముంపునకు గురేయ్యే ప్రమాదం ఉంది. జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి స్వర్ణముఖి నది సమీపంలో తెగ్గొట్టిన పొర్లు కట్టలను పూడ్చివేసి, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయాలని సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
డీస్పీకి ఫిర్యాదు
అయ్యప్పరెడ్డిపాళెం గ్రామ సమీపంలో స్వర్ణముఖి నది నుంచి భారీ హిటాచీ యంత్రాలతో టిప్పర్లలో ఇసుక అక్రమ రవాణాకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనిపై గ్రామస్తులు కొందరు గురువారం రాత్రి నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పరిశీలించి చర్యలు చేపడుతామని డీఎస్పీ హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు.
రోజుకు వందల ట్రాక్టర్ల అక్రమ రవాణా
చిల్లకూరు, కలవకూరు, కప్పగుంట కండ్రిగ గ్రామాల వద్ద స్వర్ణముఖి నది నుంచి జేసీబీలతో తవ్వేసి ట్రాక్టర్లలో యథేచ్ఛగా తరలిస్తున్నారు. ప్రతి రోజూ వందల ట్రాక్లర్ల ఇసుకను నాయుడుపేట సమీపంలోని మేనకూరు సెజ్‌లోని పరిశ్రమలకు అక్రమ రవాణా చేస్తున్నారు. ఇసుకాసురులంతా అధికార పార్టీ నాయకులే కావడంతో అధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదు.
నది పొర్లు కట్టలు ధ్వంసం
నాయుడుపేట పట్టణ పరిధిలోని ఏల్‌ఏ సాగరం, బీడీ కాలనీ, మర్లపల్లి, అన్నమేడు, కల్లిపేడు, మూర్తిరెడ్డి పాళెం, భీమవరం తదితర గ్రామాల్లో చాలా చోట్లు స్వర్ణముఖి నది పొర్లు కట్టలను సైతం ధ్వంసం చేశారు. ట్రాక్టర్లు, లారీలు, టిప్పర్ల రాకపోకలు అనువుగా ఏర్పాట్లు చేశారు. ఆ మార్గంలో పగలు, రాత్రి తేడా లేకుండా అక్రమంగా ఇసుక తరలించేస్తున్నారు. మండల పరిధిలోని చిగురుపాడు, మర్లపల్లి, అయ్యప్పరెడ్డి పాళెం తదితర గ్రామాల్లో అక్రమ రవాణాపై ప్రశ్నిస్తున్న గ్రామస్తుల ఇసుకాసురులు దౌర్జ్యనానికి దిగుతున్నారు. చిగురుపాడు గ్రామం వద్ద స్వర్ణముఖి నది వద్ద ఇటీవల అధికారులు అడ్డు కట్టలు వేశారు. వాటిని తొలగించి మళ్లీ అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు.
మది.. చెదిరినది
మది.. చెదిరినది
మది.. చెదిరినది


