బాబు పాలనలో ప్రజలకు తీవ్ర అన్యాయం
రైల్వేకోడూరు: కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్‌ఏ శ్యామల అన్నారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పార్టీ రైల్వేకోడూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొరముట్ల శ్రీనివాసులు ఆదేశాల మేరకు తల్లెం భరత్ కుమార్ రెడ్డి, వెంకట సుబ్బయ్య బుధవారం రేణిగుంట ఎయిర్ పోర్టులో ఆర్‌ఏ శ్యామలకు పుష్పగుచ్ఛం అందజేసి, ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్యామల రైల్వేకోడూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక్కడ ఆమె విలేకరులతో మాట్లాడుతూ జన్మనిచ్చిన రాయలసీమపై చంద్రబాబు నాయుడు ధ్వేషం పెంచుకోవడం చాలా బాధాకరమన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేందుకు చంద్రబాబు తన వంతు సన్నాహాలు చేస్తున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ నడపడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. సముద్రంలో నీరు వృథా పోకుండా ఉండేందుకు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ముందుచూపుతో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీరు అందించాలని రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తే చంద్రబాబు ప్రభుత్వం దాన్ని తుంగలో తొక్కి తెలంగాణ ప్రభుత్వానికి వత్తాసు పలకడం చాలా దుర్మార్గమన్నారు. అనంతరం చిట్వేలిలోని మాజీ ఎమ్మెల్యే గుంటి ప్రసాద్ దశదిన కర్మకు ఆమె హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సాయికిషోర్ రెడ్డి, చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, సుంకేశుల రఫీ తదితరులు పాల్గొన్నారు.


