నిమ్మ రైతులకు ఊరట
సైదాపురం: నిమ్మ ధరలు మూడు రోజుల నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవల చలి ప్రభావంతో నిమ్మ ధరలు ఆశించిన స్థాయిలో పలకక పోవడంతో రైతులు ఆందోళన చెందారు. ప్రస్తుతం గూడూరు మార్కెట్‌లో కిలో నిమ్మకాయలు రూ.25 నుంచి రూ.40 ధర పలుకుతున్నాయి. అయితే నాణ్యత కలిగిన కాయలు ధర రూ.40 వస్తున్నట్లు రైతులు పేర్కొన్నారు. గతంలో కిలో కేవలం రూ.6 మాత్రమే పలకడంతో రైతులు కాయలను చెట్లుకే వదిలివేశారు. సైదాపురం మండలంలో సుమారు 9 వేల ఎకరాలకు పైగా నిమ్మ సాగు చేస్తున్నారు. రైతులందరూ నిమ్మ తోటలపైనే ఆధారపడి ఉన్నారు. ఈక్రమంలో ఇటీవల వరకు రూ.6 పలికిన ధరలు నేడు రూ.25 నుంచి రూ.40 వరకు పలుకుతుండడంతో నిమ్మ రైతులకు కొంత మేర ఊరట లభించింది. దీంతో సోమవారం గూడూరు నిమ్మ మార్కెట్‌లో లూజు (50 కిలోల బస్తా)రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు కొనుగోలు చేశారు. నాణ్యత కలిగిన నిమ్మకాయలకు మరింతఽ ధర లభిస్తోంది. ఈ సీజన్‌లో నిమ్మ కాయలున్నా రైతులకు అధిక ధరలు పలికే అవకాశం ఉంటుంది.


