ఏ.రంగంపేటలో పశువుల పందేలు రేపు
చంద్రగిరి: మండలంలోని ఏ.రంగంపేటలో బుధవారం పశువుల పందేలు(జల్లికట్టు)ను నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది కనుమ రోజున పందేలను నిర్వహించడం ఆనవాయితీ. అదే రోజు గ్రామంలోని ఇద్దరు మృతి చెందడంతో శూతకం కారణంగా వాయిదా వేశారు. దీంతో బుధవారం వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లను చురుగ్గా చేస్తున్నారు.
నేడు ఎస్వీ అగ్రికల్చర్ కాలేజీలో జాతీయ సదస్సు
చంద్రగిరి: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో రెండు రోజుల పాటు జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు కళాశాల అసిసోసియేట్ డీన్ డాక్టర్ రెడ్డి శేఖర్ తెలిపారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ తెగుళ్ల శాస్త్ర విభాగం, ఇండియన్ ఫైటో ప్యాథలాజికల్ సొసైటీ, సొసైటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైంటిస్ట్ ఆధ్వర్యంలో మంగళ, బుధవారాల్లో జాతీయ సదస్సు, సింపోజియం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా వ్యవసాయ వర్సిటీ వీసీ డాక్టర్ శారద జయలక్ష్మీదేవి, వర్సిటీ ఉన్నత అధికారులు పాల్గొంటారన్నారు. అలాగే వియత్నం దేశం నుంచి ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ గుయన్ డాక్ కోవా, షిమోగా వ్యవసాయ వర్సిటీ మాజీ వీసీ డాక్టర్ ఎంకే. నాయక్‌తోపాటు పలువురు శాస్త్రవేత్తలు హాజరుకానున్నారన్నారు. అలాగే 8 రాష్ట్రాల నుంచి పీజీ పీహెచ్‌డీ పరిశోధక విద్యార్థులు, వివిధ వ్యవసాయ వర్సిటీల అధ్యాపకులు శాస్త్రవేత్తలు పాల్గొంటారన్నారు.


