● ధాన్యం కొనుగోలుకు పంట నమోదు తప్పనిసరి ● ఫిబ్రవరి 25 ఆ
పంట నమోదు చేస్తున్న అగ్రికల్చర్ అసిస్టెంట్లు (ఫైల్)
తిరుపతి అర్బన్: ప్రతి సంవత్సరం నవంబర్ మొదటి వారంలో ఈ–క్రాప్ నమోదుకు శ్రీకారం చుడుతుంటా రు. జనవరి 31వ తేదీలోపు పూర్తి చేస్తుంటారు. అయితే చంద్రబాబు ప్రభుత్వ అలసత్వం కారణంగా గత ఏడాది డిసెంబర్ చివరి వారంలో పంటల నమోదును ప్రారంభించారు. ఫిబ్రవరి 25వ తేదీ వరకు గడువు నిర్దేశించారు. అయితే ఇప్పటి వరకు కేవలం 21శాతం మాత్రమే ఈ–క్రాప్ నమోదు చేసినట్లు తెలిసింది.
సిబ్బంది కొరత
ఈ–క్రాప్ నమోదు చేయడమంటే అగ్రికల్చర్ అసిస్టెంట్లు రైతు పొలం వద్దకు వెళ్లి ఫొటో తీసి అప్‌లోడ్ చేయాలి. అందులో ఎంత విస్తీర్ణంలో సాగు చేపట్టారు. ఏ పంట వేశారనే వివరాలను పొందుపరచాలి. అయితే జిల్లా లో మొత్తం 445 రైతు సేవా కేంద్రాలుంటే, అందులో 45శాతం సెంటర్లలో అగ్రికల్చర్ అసిస్టెంట్లు లేరు. ఉన్నవారు వివిధ సర్వేల్లో తలమునకలయ్యారు. దీంతో ఈ–క్రాప్‌నమోదులో తీవ్రమైన జాప్యం తప్పడం లేదు. ఒక వైపు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ–క్రాప్ నమోదు చేయకుంటే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయదు. ఇక రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించాల్సి వస్తుంది. అరకొర ధరలకు పంటలను అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురిస్తుంది.
2.35 లక్షల ఎకరాల్లో వరి సాగు
ఈ రబీ సీజన్‌లో 2.35 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేపట్టారు. వీరందరూ ప్రభుత్వానికి ధాన్యం విక్రయించాలనే ఆలోచనలో ఉన్నారు. శ్రీకాళహస్తి ఏపీ సీడ్స్ సంస్థ ఏటా రబీ సీజన్‌లో 5వేల ఎకరాల్లోని వరి పంటను రైతుల నుంచి కొనుగోలు చేస్తుంది. అయితే నష్టాలు వస్తున్నాయంటూ ఈ ఏడాది కొనుగోలు చేయలేమని తేల్చి చెప్పేసింది. దీంతో ఆ రైతులు కూడా ప్రభుత్వానికే ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో గడువు లోపు 100 శాతం ఈ క్రాప్ నమోదు చేయాల్సిన బాధ్యత అగ్రికల్చర్ అసిస్టెంట్లపై ఉంది. అలాగే మరో 55 వేల ఎకరాల్లో మామిడి పంట, 45 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు జిల్లాలో సాగులో ఉన్నాయి.


