కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం వాగ్వాదాలు
చంద్రగిరి: కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం కోసం చేపట్టిన సంస్థాగత నిర్మాణ కార్యక్రమం తిరుపతి జిల్లాలో వాడివేడిగా ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్ష పదవి కోసం తమిళనాడు మైలాడుతురై ఎంపీ సుధా రామకృష్ణన్ పరిశీలకురాలిగా హాజరై జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఉన్నవారు దరఖాస్తులు చేసుకునే కార్యక్రమం సోమవారం తిరుచానూరులోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వివిధ విభాగాల నాయకుల వాగ్వాదాలతో ఎంపీ సుధా రామకృష్ణన్ అసహనంతో విసిగిపోయారు. కార్యక్రమం ప్రారంభం కాకముందే జిల్లా అధ్యక్ష పదవి కోసం రేసులో ఉన్న వారి అనుచరవర్గం పదేపదే నినాదాలు చేయడంతో ఒకింత గందరగోళం నెలకొంది. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు బాలగురవం బాబు, తిరుపతి నగర అధ్యక్షుడు గౌడ పేరు చిట్టిబాబు, యార్లపల్లి గోిపీ గౌడ్, పంట శ్రీనివాసులు రెడ్డి అధ్యక్ష పదవులకు దర ఖాస్తుదారుల్లో ముందున్నారు. ఈ నేపథ్యంలో యార్లపల్లి గోిపీ గౌడ్ మద్దతుదారులు స్టేజ్ పైకి గోపి గౌడ్‌ను పిలవకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. జిల్లా అధ్యక్ష పదవి ఎంపిక దరఖాస్తులకు సంబంధించిన సమాచారం ఇంత రహస్యంగా ఎందుకు చేస్తున్నారు? అని కొంతమంది నాయకులు ఎంపీ నిలదీశారు. ఈ సమయంలో మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ జోక్యం చేసుకున్న వారు వినకుండా మరింతగా నినాదాలు చేశారు. అనంతరం ఏఐసీసీ పరిశీలకురాలు, ఎంపీ సుధా రామకృష్ణన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం క్యాడర్‌లో ప టిష్ట నిర్మాణాలకు శ్రీకారం చుట్టామన్నారు. పార్టీ తిరుపతి జిల్లా శాఖలో అంతర్గత కలహాలు ఉన్నాయని, ఆ కలహాలు శృతి మించి పోయాయని, అధిష్టానం దృష్టికి ఎలా తీసుకెళతారని మీడియా ప్రశ్నించగా, ఇదంతా తమ కుటుంబమేనని, తామే పరిష్కరించు కుంటామని ఆమె చెప్పారు. పీసీసీ పరిశీలకులు మదన్‌మోహన్, టిక్కి రాయల్, పీసీసీ ఉపాధ్యక్షుడు దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు పాల్గొన్నారు.


