
వైఎస్సార్‌సీపీ నేత గోడ ధ్వంసం
కోట: మండలంలోని కర్లపూడి దళితవాడలో నివాసం ఉంటున్న వైఎస్సార్‌సీపీ మండల ప్రధాన కార్యదర్శి పాముల సురేంద్రకు చెందిన ప్రహరీ గోడను సోమవారం కొందరు దౌర్జన్యంగా కూల్చివేశారు. దీనిపై బాధితుడు సురేంద్ర కుటుంబ సభ్యులతో కలసి గూడూరు డీఎస్పీ గీతాకుమారికి ఫిర్యాదు చేశారు. ఆయన కథనం మేరకు.. కర్లపూడి దళితవాడలో పాముల సురేంద్ర పదేళ్ల క్రితం ప్రహరీ గోడ నిర్మించుకున్నారు. ఇంట్లో తాము లేని సమయంలో ఆ గ్రామానికి చెందిన పుచ్చలపల్లి క్రిష్ణయ్య, శ్రీనివాసులు, బైనా చిన్నయ్య ఇంట్లోకి చొరబడి గోడను కూల్చివేశారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పేర్నాటి ఆనందరెడ్డి, ఎస్‌ఐ పవన్‌కుమార్ అక్కడే ఉండి గోడను కూల్చివేయమని చెప్పినట్లు బాధితుడు వాపోయాడు. ఇంతలోనే వారు అక్కడకు చేరుకుని ప్రశ్నించగా టీడీపీ నాయకుడు ఆనందరెడ్డి తనతో పాటు కుటుంబ సభ్యులందరినీ కులం పేరుతో దూషిస్తూ ‘మాకే ఎదురు తిరుగుతార్రా.. మీకు తగిన శాస్తి చేస్తాం.’ అని బెదిరించాడని పాముల సురేంద్ర తెలిపారు. దీనిపై విచారణ జరిపి దళితులమైన తమకు రక్షణ కల్పించి, వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. విచారణ జరిపించి న్యాయం చేస్తానని డీఎస్పీ వారికి తెలిపారు.