
పనితీరుకు ర్యాంకింగ్‌లు
తిరుపతి అర్బన్ : ప్రభుత్వ లక్ష్యం మేరకు కార్యక్రమాలను అమలు చేయడంలో పురోగతి చూపాలని ఇన్‌చార్జి జోనల్ ఆఫీసర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య , కుటుంబ సంక్షేమశాఖ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. కలెక్టరేట్‌లో ఆయన గురువారం కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, అడిషనల్ ఎస్పీ రవిమనోహరాచారి, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షి, డీఆర్వో నరసింహులతో కలసి ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర..స్వచ్ఛాంధ్ర, పీ4 కార్యక్రమాల పనితీరును తెలుసుకున్నారు. జిల్లాల వారీగా ర్యాంకింగ్ ఉంటుందని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అలాగే వ్యవసాయ, ఉద్యానశాఖ అభివృద్ధికి పనిచేయాలని చెప్పారు. కొత్త ఆలోచనలతో జిల్లాను అభివృద్ధి దిశగా తీసుకుపోవాలని ఆయన సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించడానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షించి పురోగతిని చూపుతామని చెప్పారు. అలాగే వ్యవసాయ, ఉద్యానశాఖల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.