
అగ్రకులాల దౌర్జన్యాలపై చర్యలు తీసుకోండి
చంద్రగిరి : వెటర్నరీ యూనివర్శిటీలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నిస్తే బీసీ విద్యార్థులపై అగ్ర కులాలకు చెందిన కొంత మంది దౌర్జన్యాలు చేయడంపై బీసీ సంఘం విద్యార్థులు మండిపడ్డారు. వెటర్నరీ యూనివర్సిటీలోని నకుల హాస్టల్లో విద్యార్థులకు అందించే అల్పాహారంలో పురుగులు రావడంతో ఓబీసీ విద్యార్థి సంక్షేమం సంఘం జాతీయ అధ్యక్షుడు నాగేశ్వర్‌రావు వార్డెన్ తిరుపతిరెడ్డి దృష్టికి తీసుకెళ్లాడు. అయితే వార్డెన్‌తో మాట్లాడుతున్న క్రమంలో కొంత మంది విద్యార్థులు నాగేశ్వర్‌రావుపై దౌర్జన్యానికి యత్నించడంతో బీసీ విద్యార్థులు మండిపడ్డారు. అనంతరం విద్యార్థి సంఘం నేతలు యూనివర్సిటీ వీసీకి ఫిర్యాదు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులతో కొంత మంది అగ్ర కులాలకు చెందిన వారు బెదిరింపులకు పాల్పడటం, గొడవలకు రావడం దారుణమన్నారు. వార్డెన్‌కు చెందిన కొంత మంది విద్యార్థి సంఘం నేత నాగేశ్వర్‌రావుపై దౌర్జన్యానికి పాల్పడటం దారుణమన్నారు. ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున బీసీ విద్యార్థి సంఘాలతో నిరసనకు దిగుతామని వీసీ ఎదుట స్పష్టం చేశారు. వీసీ కేవీ.రమణ మాట్లాడుతూ.. సోమవారం ఈ విషయమై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విద్యార్థి సంఘ నేతలకు వివరించారు.