
పులివెందుల ఉపఎన్నికలో ప్రజాస్వామ్యం ఖూనీ
వాకాడు : పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన గురువారం వాకాడులో పర్యటించి మాట్లాడుతూ.. అధికార కూటమి ప్రభుత్వం తన గూండాల చేత ఎన్నికలను ఏక పక్షంగా రిగ్గింగ్ చేసుకుందని ఆరోపించారు. ప్రజాబలం లేకున్నా తన అధికారం అండతో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో కూటమి ప్రభుత్వం సాగించిన దౌర్జన్యం, దుర్మార్గాన్ని ప్రజలంతా గమనించారని, తప్పకుండా వారికి బుద్ధి చెప్పి తీరుతారన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జాన్యాలకు చంద్రబాబు, వారి నాయకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడవడంలో.. ప్రజాస్వామ్యాన్ని చెరబట్టడంలోనూ.. తాను బ్రాండ్ అంబాసిడర్‌నని చంద్రబాబు మరోమారు నిరూపించారన్నారు. కూటమి ప్రభుత్వానికి ముగింపు పలికే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ప్రజలంతా వైఎస్సార్‌సీపీ పక్షాన ఉన్నారని రామ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.