
సంగమేశ్వర స్వామి హుండీ చోరీ
కోట : గూడలిలోని కామాక్షీదేవి సమేత సంగమేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల అనంతరం సంగమేశ్వరుని సన్నిధిలోని హుండీ చోరీకి గురైనట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామపెద్దలు ఈ విషయమై చర్చించేందుకు గురువారం ఆలయం వద్ద సమావేశమయ్యారు. దేవాదాయశాఖ ఈఓ శశాంక్, ఆలయ అర్చకుడు కార్తీక్‌పై వారు ఆరోపణలు చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు స్వామి వారి హుండీలో నగదు, కానుకలు వేశారని, మే 3వ తేదీ రాత్రి ప్రధాన ద్వారం తలుపు తాళాలు పగులగొట్టి ఉన్నట్లు వాచ్‌మెన్ గుర్తించి పూజారి, ఈఓకు ఫిర్యాదు చేశారని, అయితే వారు చోరీ విషయాన్ని బయటపెట్టకుండా దాచి ఉంచారని గ్రామస్తులు తెలిపారు. స్వామి వారి హుండీలో ఉన్న రూ.లక్షల రూపాయలు మాయం అయ్యాయన్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపాలన్నారు.
పీఠం కదిలిందా..కదిలించారా..
కామాక్షీదేవి సమేత సంగమేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారి పీఠం కదిలిందని ఈనెల 10 నుంచి మూడు రోజులు ప్రతిష్ఠా మహోత్సవాలు నిర్వహించారు. దీనిపై గ్రామపెద్దలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుప్త నిధి కోసం పీఠాన్ని కదిలించారన్న అనుమానం వ్యక్తం చేశారు. ఉప సర్పంచ్ విజయసారఽథిరెడ్డి, షనీల్‌రెడ్డి, సత్యనారాయణ, వెంకటక్రిష్ణారెడ్డి, దేవేంద్రరెడ్డి, రఘునాథరెడ్డి పాల్గొన్నారు.