
బియ్యం కూడా ఇవ్వలేరా సామీ..?
తిరుపతి అర్బన్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ రేషన్ సరుకులు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. సోమవారం తిరుపతి అర్బన్ తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని సివిల్ సప్లయ్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 1 నుంచి 15 వరకు రేషన్ బియ్యం ఇవ్వాల్సి ఉందని చెప్పారు. అయితే 1 నుంచి 4 లేదా 5వ తేదీకే డీలర్లు దుకాణాలు మూసి వెళ్తున్నారని మండిపడ్డారు. గత నెలలో 65 వేల మంది కార్డుదారులు బియ్యం తీసుకోలేదన్నారు. డీలర్లు అదనంగా 10శాతం బియ్యం ఇచ్చేవారని.. దాంతో తమ రేషన్ పరిధిలోని వారు కాకుండా స్థానికేతరులు వచ్చిన డీలర్లకు బియ్యం ఇచ్చేవారని చెప్పారు. అయితే కూటమి సర్కార్‌లో డీలర్లు ఇస్తున్న 10శాతం అదనపు బియ్యాన్ని నిలుపుదల చేయడంతో స్థానికేతరులకు బియ్యం ఇవ్వడం లేదని వెల్లడించారు.