
అన్నదాతకు తీరని నష్టం
● గాలీవాన బీభత్సానికి 270 ఎకరాల్లో నేలవాలిన వరి పైరు ● 148 మంది రైతన్నలకు రూ.3.5 కోట్ల మేర నష్టం
వాకాడు : మరో నాలుగు రోజుల్లో కోత కోయాల్సిన వరి పంట నేలపాలైంది. నాలుగు రోజుల్లో పంట చేతికొస్తుందని సంబరపడిన అన్నదాతలకు ఆదివారం రాత్రి కురిసిన వర్షం రూపంలో తీరని నష్టం వాటిల్లింది. సుమారు 148 మంది రైతన్నలకు కంటతడిని మిగిల్చింది. దీంతో 270 ఎకరాల్లో పంట నేలవాలి మొలకెత్తి, పాచిపోతోంది. వర్షం అదును దాటి కురవడంతో రైతులకు తీరని నష్టాన్ని తెచ్చిపెట్టింది. మండలవ్యాప్తంగా ఖరీఫ్‌లో 1500 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అందులో తొలిదశలో ఇప్పటివరకు 209 ఎకరాల్లో పంట కోత పూర్తయింది. ఈ నెల 15 నుంచి రెండో దశ పంట కోత ఉండగా.. మొత్తం 270 ఎకరా ల్లో వర్షానికి పంట నీట మునిగింది. దీంతో మండలంలో దాదాపు రూ.3.5 కోట్లు నష్టం వాటిల్లినట్లు రైతులు చెబుతున్నారు. అప్పులు చేసి సాగు చేసిన పంట నేలవాలడంతో కన్నీరే మిగిలిందని రైతులు వాపోతున్నారు. గతేడాది కనీసం పెట్టిన పెట్టుబడులు చేతికందక అప్పుల ఊబిలో కూరుకుపోయామని.. ఇప్పుడు ఈ వర్షం మరింత అప్పుల్లోకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.