
హక్కులను కాలరాస్తే ప్రతిఘటిస్తాం
సమస్యలపై పోరాడాలన్న యువగళం పిలుపు ఏమైంది లోకేష్?–సంఘాల ఎన్నికలు నిర్వహిస్తామన్న మీరు హామీ ఇవ్వలేదా?–తక్షణం ఆంక్షలు ఎత్తివేయకుంటే ఉద్యమాలు ఉధృతం చేస్తాం–తిరుపతిలో కూటమి ప్రభుత్వంపై విద్యార్థి సంఘాల కన్నెర్ర–మంత్రి లోకేష్ దిష్టిబొమ్మ దహనానికి యత్నం... ఉద్రిక్తత
● ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం
● హామీలు నెరవేర్చలేదంటూ మంత్రి
లోకేష్ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నం
● విద్యార్థి సంఘాల నేతలను అడ్డుకున్న పోలీసులు
తిరుపతి సిటీ: కూటమి ప్రభుత్వంపై విద్యార్థి సంఘాలు మరోసారి కన్నెర్ర చేశాయి. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తే ఖబడ్దార్ అని హెచ్చరించాయి. ఈ మేరకు విద్యార్థి సంఘాల నాయకులు సోమవారం శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్వీయూ) నుంచి తిరుపతి టౌన్ క్లబ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి లోకేష్ దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించగా వందల సంఖ్యలో పోలీసులు చేరుకుని వారిని ఈడ్చి పడేసి అడ్డుకున్నారు. ఓ దశలో పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలు, కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీపై పోరాడుతున్న వామపక్ష, ప్రజాతంత్ర విద్యార్థి సంఘాలను విద్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకునేలా ఉత్తర్వులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. తక్షణమే వాటిని రద్దు చేయకుంటే పెద్దఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను సర్వనాశనం చేశారని, స్కూళ్లు, కళాశాలల్లో మౌలిక వసతులు కొరవడ్డాయని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రశ్నించినందుకు విద్యార్థి సంఘాలపై ఆంక్షలు విధిస్తూ బ్రిటీష్ పాలనను తలపించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
మీదే బాధ్యత అన్నారు కదా లోకేష్?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, సంఘాలకు ఎన్నికలు నిర్వహించే బాధ్యత తనదే అని ప్రగల్బాలు పలికారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక సమస్యలకు పరిష్కారం చూపకపోగా, ప్రశ్నిస్తున్న వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ తిరుపతి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అక్బర్, రవి, వినోద్, అశోక్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఉదయ్‌కుమార్, ప్రవీణ్, విష్ణు, వినయ్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున, నల్సా రాష్ట్ర అధ్యక్షుడు సుందర్, పీడీఎస్‌ఓ నాయకురాలు స్రవంతి, ఏఐఎస్‌ఐ, ఇతర విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

హక్కులను కాలరాస్తే ప్రతిఘటిస్తాం