
వెంకటగిరిలో వైఎస్సార్‌సీపీ హవా
● కొత్త మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్‌ను రద్దు చేసిన కౌన్సిలర్లు ● పాత మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్‌లే కొనసాగించాలని 16 మంది ఆమోదం ● టీడీపీకి చెంప పెట్టులాంటి తీర్పు ● మరోసారి విఫలమైన కూటమి ప్రభుత్వ ప్రయత్నాలు
వెంకటగిరి (సైదాపురం): కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడంతో పాటు పదవులను సైతం తమ గుప్పెట్లో వేసుకునేందుకు విశ్వప్రయత్నాలు సాగిస్తోంది. అయితే తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్‌లో మాత్రం వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలో టీడీపీకి వరుస పరాజయాలు చవి చూపిస్తున్నారు. తొలిసారి మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికీ అవిశ్వాసం అంశం తెరపైకి తెచ్చి అభాసుపాలయ్యారు. ఈ విషయం మరువకముందే మరోసారి మున్సిపల్ లీగల్ అడ్వైజర్‌గా ఉన్న జయప్రకాష్‌ను మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ నుంచి తొలగించి కొత్తవారికి నియమించాలని టీడీపీ నేతలు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 24వ అంశంగా పొందుపరిచారు. ఇందుకు సముచితంగా కొందరు మున్సిపల్ కౌన్సిలర్లు లేరు. ఈ క్రమంలో ఈనెల 31వ తేదీన అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా కౌన్సిలర్లు నెల్లూరుకు తరలివెళ్లారు. గతంలో ఈ సమావేశానికి ఇద్దరు కౌన్సిలర్లు మాత్రమే హాజరు కావడంతో సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కమిషనర్ వెంకటరామిరెడ్డి వ్యక్తపరిచారు. అనంతరం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ఏకతాటిపై ఉండి అభివృద్ధికి తాము ఎప్పుడూ అడ్డురామని బహిరంగంగానే ప్రకటన చేశారు.
16 మంది ఆమోదం
వెంకటగిరి మున్సిపల్‌లో మున్సిపల్ చైర్‌పర్సన్ నక్కా భానుప్రియతో పాటు 24 మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఉండగా సోమవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన మున్సిపల్ సమావేశానికి 19 మంది మున్సిపల్ కౌన్సిలర్లు హాజరయ్యారు. సమావేశం జరుగుతున్న తరుణంలో మున్సిపల్ అధికారి అంశం–24 చదువుతుండగా ఆ అంశాన్ని చదనవసరం లేదని ఆ అంశాన్ని అజెండాలో నుంచి తొలగించాలని కౌన్సిలర్లు ముక్తకంఠంతో మున్సిపల్ చైర్‌పర్సన్ నక్కా భానుప్రియకు వివరించారు. ఈ మేరకు ఈ అంశం తొలగించాలన్నా వారు చేతులు పైకి ఎత్తమనగా 16 మంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు తమ మద్దతు వ్యక్తపరిచారు. దీంతో మున్సిపల్ కౌన్సిల్ అజెండా నుంచి అంశం–24ను తొలగించారు. దీంతో ప్రత్యక్షంగానే వెంకటగిరి మున్సిపాలిటీలో మరో విజయం వైఎస్సార్‌సీపీ తమ ఖాతాల్లోకి వేసుకుంది.