
గుర్తు తెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్ మృతి
కార్వేటినగరం: గుర్తుతెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన మండలంలోని కుప్పానిగుంట సమీపంలో చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం.. కార్వేటినగరం బీసీ కాలనీకి చెందిన అయ్యప్ప(41) పుత్తూరు ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఓ కేసు విచారణ కోసం పళ్లిపట్టుకు వెళ్తూ మార్గమధ్యంలోని సురేంద్రనగరం సమీపం, చిన్నకనుమ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి తల్లిదండ్రులతో పాటు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అయ్యప్ప మృతదేహానికి ఘన నివాళి
మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ అయ్యప్ప మృతదేహానికి తిరుపతి ఎస్సీ హర్షవర్ధన్‌రాజు ఘన నివాళి అర్పించారు. అలాగే పుత్తూరు డీఎస్పీ రవికుమార్, నగరి డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీజ్, స్థానిక సీఐ హనుమంతప్ప పూలమాల వేసి నివాళి అర్పించారు.
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ అయ్యప్ప కుటుంబానికి తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్‌రాజు రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వ పరంగా కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటానని వారికి భరోసా ఇచ్చారు. అదే విధంగా ఏఆర్ కానిస్టేబుల్ యూనియన్ ఆధ్వర్యంలో అయ్యప్ప కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సహాయం అందించారు.
పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు
ఏఆర్ కానిస్టేబుల్‌గా పుత్తూరులో విధులు నిర్వహిస్తున్న అయ్యప్ప మృతి చెందడంతో సోమవారం తన స్వగ్రామం కార్వేటినగరంలో పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
● నివాళి అర్పించిన ఎస్పీ, డీఎస్పీలు

గుర్తు తెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్ మృతి