
ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిజాయితీ
తిరుపతి రూరల్ : బస్సులో దొరికిన బంగారు నగలను బాధితురాలికి అప్పగించి ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ తన నిజాయతీని చాటుకున్నాడు. వివరాలు.. పుంగనూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ39జెడ్0092) తిరుపతి నుంచి భీమవరం, కొమ్మిరెడ్డిగారిపల్లి మీదుగా పుంగనూరుకు సర్వీసు నడుస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 10 తేదీన ఆదివారం తిరుపతి స్టాఫ్ క్వార్టర్స్ వద్ద తన చంటిబిడ్డను ఎత్తుకుని బస్సు ఎక్కిన సోంప ల్లి భార్గవి వెంకటరామాపురం వద్ద దిగి వెళ్లిపో యింది. కాసేపటి తరువాత తన రెండేళ్ల కుమార్తె రిషితాచౌదరి మెడలోని బంగారం గొలుసుకు ఉన్న లాకెట్ కనిపించక పోవడంతో బస్సులోనే పడిపోయి ఉంటుందన్న అనుమానంతో ఆర్టీసీ డిపో మేనేజర్‌కు ఫోన్ చేసింది. ఆమె దగ్గర ఉన్న టికెట్ ఆధారంగా ఆయన బస్ డ్రైవర్ అల్తాఫ్‌కు సమాచారం చేరవేయడంతో అప్పటికే సదుం దగ్గర వెళ్తున్న ఆయన బస్సును ఆపి ఆమె కూర్చు న్న సీటు వద్దకు వెళ్లి చూడగా సీటు కింద పడి ఉంది. వెంటనే ఆయన బంగారం లాకెట్‌ను తీసుకు ని బాధితురాలికి సోమవారం ఉదయం ఆమెకు అప్పగించారు. అయితే నిజాయితీ చాటుకున్న బస్సు డ్రైవర్ అల్తాఫ్‌ను బాధితురాలి కుటుంబీకులతో పాటు గ్రామస్తులు అభినందించారు.
వైభవంగా గెరిగ ఊరేగింపు
రేణిగుంట: గంగ జాతర మహోత్సవాల సందర్భంగా సోమవారం అమ్మవారికి ప్రతిరూపమైన గెరిగ ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహించారు. పురవీధుల్లో అడుగడుగునా భక్తులు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో కర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. రేణిగుంటలో గ్రామ దేవతగా వెలసిన గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. సోమవారం అమ్మవారికి ప్రతిరూపమైన గెరిగను అలంకరించి, గ్రామ చాకలిలో విశేష అలంకరణలో తలపై గెరిగను పెట్టుకుని డప్పుల దరువులు, పంబ వాయిద్యాల నడుమ పట్టణంలోని వీధుల్లో దర్శనమిచ్చారు. మంగళవారం జరగనున్న గంగ జాతర మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. రేణిగుంట పోలీసుల సహకారంతో భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కమిటీ సభ్యులు చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త సోలా మల్లికార్జున్ రెడ్డి, సదా శివ రెడ్డి, జ్యోతి నారాయణ, ఉమేష్,లక్ష్మణ్ రెడ్డి, వీఆర్ రావణ, చినబాబు,సూరి,రేణు,భాస్కర్,వార్డు సభ్యులు ఎంజీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిజాయితీ