
తల్లికి పిడికెడు అన్నం పెట్టలేక..!
● ఇంటి నుంచి గెంటేసిన ఓ ప్రబుద్ధుడు ● కలెక్టరేట్‌లో జరిగిన గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసిన ఓ తల్లి
సాక్షి టాస్క్‌ఫోర్స్: నవమోసాలు మోసి కని పెంచిన తల్లికి పట్టెడన్నం పెట్టలేక ఓ కొడుకు ఇంటి నుంచి గెంటేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. తిరుపతి జిల్లా బాలాయపల్లికి చెందిన పెంచలయ్య నాయుడు, రావి సులోచనమ్మకు రావి హరిప్రసాద్, రెండవ కుమారుడు రావి రవికుమార్ ఇద్దరు కొడుకులు. పెంచలనాయుడు చనిపోయిన తర్వాత ఆయన ద్వారా సంక్రమించిన స్థిరాస్తులను ఇద్దరు కుమారులు, తల్లి రావి సులోచనమ్మ పంచుకుని, ఒప్పంద పత్రం రాసుకున్నారు. ఆ ప్రకారం ముగ్గురు వేర్వేరుగా కలిసి కాపురం ఉండాల్సి ఉంది. అయితే రెండో కొడుకు రావి రవికుమార్, అతని భార్య లక్ష్మికామాక్షి ఇద్దరూ కలిసి తాము చూసుకుంటామని చెప్పి తల్లి సులోచనమ్మను వారింటికి తీసుకెళ్లారు. కొద్దిరోజుల తర్వాత కుమారుడు రవికుమార్ భార్యతో కలిసి తల్లి దగ్గర ఉన్న రూ.10 లక్షల నగదు, 15 సవర్ల బంగారు నగలను నమ్మించి తీసుకున్నాడు. అంతేకాకుండా ఆమె స్థిరాస్తులను కూడా అనుభవిస్తున్నాడు. ఆ తర్వాత ఆమెను కొట్టి ఇంటి నుంచి తరిమివేశాడు. దిక్కుతోచని స్థితిలో ఆమె బాలయ్యపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కొడుకు, కోడలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తమ మీదే కేసు పెడతావా.. నిన్ను చంపేస్తామని వారు ఆమెను భయబ్రాంతులకు గురిచేశారు. ఈ నేపథ్యంలో ఆమె సోమవారం కలెక్టరేట్‌లో అధికారులకు తన పరిస్థితిని వివరించడంతో తప్పకుండా న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.