
దళితుల భూముల్లో పెత్తనం చెలాయిస్తారా?
చిల్లకూరు : కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొంతమంది నాయకులు దళితులు సాగు చేసుకునే భూములను ఆక్రమించుకుంటూ పెత్తనం చెలాయిండం దారుణమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సోమవారం ఆయన తిరుపతి నుంచి విజయవాడ వెళ్తుండగా చిల్లకూరు మండలం నక్కలకాలువ కండ్రిగలోని మిగుల భూములను స్థానిక సీపీఐ నాయకులతో కలసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నక్కలకాలువ కండ్రిగలో సర్వే 1 నుంచి 23 వరకు ఉన్న మిగుల భూములు సుమారు 126 ఎకరాలను 2003 నుంచి నెలబల్లిరెట్టపల్లికి చెందిన దళితులు సాగు చేసుకుంటున్నారని తెలిపారు. మధ్యలో ఆ భూములను ఏపీఐఐసీకి కేటాయించినట్లు అధికారులు చెప్పడంతో కొంతమంది దళితులు సాగు చేయలేదన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ భూములపై కన్నేసిన కూటమి నాయకులు తమకు అనుకూలంగా ఉన్న వారి పేరిట స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. రెండు రోజులుగా కూటమి నాయకులు ఈ భూములను దున్ని గట్లు తొలగించి దళితులపై దౌర్జన్యానికి పాల్పడడం దారుణమని, తక్షణం వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ప్రతి దళిత కుటుంబానికి కనీసం అరెకరం చొప్పున భూములు కేటాయించాలని కోరారు. ఆయన వెంట సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సీహెచ్ ప్రభాకర్, నాయకులు ఉన్నారు.