ముగ్గురికి గాయాలు
చిట్టమూరు : మండల పరిధిలోని మొలకలపూడి బోటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. వాకాడు గ్రామానికి చెందిన కావలి కిరణ్‌కుమార్ (40), నాయుడుపేటకు వెళ్లి తిరిగి స్వగ్రామం వాకాడుకు మోటారు సైకిల్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలోనే పెళ్లకూరు మండలం పున్నేపల్లి గ్రామానికి చెందిన కోవూరు వెంకటరమణ (42) నాయుడుపేట మండలం గొట్టిప్రోలు గ్రామానికి భార్యా, పిల్లలతో వెళ్లి తిరిగీ పున్నెపల్లికి బైక్‌పై బయలు దేరగా రెండు మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా మొలకలపూడి గ్రామ సమీపంలోని బోటు వద్ద ఢీ కొనడంతో వాకాడుకు చెందిన కిరణ్‌కుమార్, పున్నేపల్లికి చెందిన కోవూరు వెంకటరమణ మృతి చెందారన్నారు.
అయితే మోటార్ సైకిల్ వెనుక కూర్చుని ఉన్న వెంకటరమణ భార్య, పిల్లలకు తీవ్ర గాయాలు కావడంతో 108లో నాయుడుపేట వైద్య శాలకు తరలించి చికిత్స చేస్తున్నారు. చిట్టమూరు ఎస్‌ఐ చిన్న బలరామయ్య సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మృత దేహాలను నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టంకు తరలించారు. వాకాడుకు చెందిన కిరణ్‌కు భార్య పిల్లలు ఉన్నారు. దీంతో రెండు గ్రామాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
పెన్నేపల్లిలో విషాదం
పెళ్లకూరు : మండలంలోని పెన్నేపల్లి గ్రామానికి చెందిన కోవూరు వెంకటరమణ ఆదివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామంలోని దళిత కాలనీకి చెందిన వెంకటరమణ భార్య కామాక్షి పిల్లలు కలిసి గొట్టిప్రోలు గ్రామంలో చర్చ్‌లో ఆరాధన ముగించుకొని బైక్‌లో తిరిగి స్వగ్రామం వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. వెంకటరమణ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.