
డ్యూటీకి వెళుతూ మృత్యుఒడికి..
ఏర్పేడు : ఏర్పేడు–వెంకటగిరి మార్గంలో ఏర్పేడు మండలం దుర్గిపేరి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై డ్యూటీకి వెళుతున్న ఓ యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఏర్పేడు ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి కథనం మేరకు... శ్రీకాళహస్తి మండలం కుంటిపూడి గ్రామానికి చెందిన కె.చంద్రయ్య కుమారుడు కోవూరు నవీన్ కుమార్(25) మూడు నెలల కిందట కాపుగున్నేరి సమీపంలోని కోకాకోలా కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా విధుల్లో చేరాడు. ఆదివారం ఏ–షిఫ్ట్ కావడంతో కుంటిపూడి గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై ఏర్పేడు మీదుగా కోకాకోలా కంపెనీకి వెళ్లేందుకు బయల్దేరాడు. క్రిష్ణంపల్లి క్రాస్ దాటి, దుర్గిపేరి సమీపంలో ఎదురుగా వెళుతున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తలకు బలమైన రక్తగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. చంద్రయ్యకు ముగ్గురు కుమారులు కాగా, అందరికంటే చిన్నవాడు మృతుడు నవీన్‌కుమార్. మూడు నెలల కిందటనే డ్యూటీలో చేరి కుటుంబానికి కొంత ఆసరా ఉన్న కొడుకు మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
వాకర్స్ సేవలు
మరింత విస్తృతం
తిరుపతి కల్చరల్: వాకర్స్ ప్రతినిధులు తమ సేవలను మరింత విస్తృతం చేస్తూ సమాజ శ్రేయస్సులో భాగస్వాములు కావాలని వాకర్స్ ఇంటర్నేషనల్ ఎలెక్ట్ అధ్యక్షుడు డాక్టర్ రవిరాజు, గవర్నర్ రావిళ్ల మాధమ నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం యూత్ హాస్టల్లో వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 302 క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వారితోపాటు రీజినల్ కౌన్సిలర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడారు. అనంతరం తమిళనాడు, కర్ణాటక, రాయలసీమ వాకర్స్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తమ సేవా కార్యక్రమాలను వివరించారు. అనంతరం నారాయణాద్రి హాస్పిటల్ ప్రతినిధులు వాకర్స్ సంఘాలకు బీపీ పరీక్షల యంత్రాలను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు రామచంద్రారెడ్డి, కోనేటి రవిరాజు, మనోహరన్, వినాయగం, వేణుగోపాల్‌రాజు, చంద్ర, శాంతి నాడార బాలాజీ నాయుడు, వాకర్స్ పాల్గొన్నారు.

డ్యూటీకి వెళుతూ మృత్యుఒడికి..