ఉచిత విద్య.. మిథ్య | - | Sakshi
Sakshi News home page

ఉచిత విద్య.. మిథ్య

Aug 9 2025 8:40 AM | Updated on Aug 9 2025 8:40 AM

ఉచిత విద్య.. మిథ్య

ఉచిత విద్య.. మిథ్య

ఆరంభం శూరత్వమేనా?

ప్రైవేటు పాఠశాలలో ఉచిత అడ్మిషన్లు అరకొరే

మాటవినని ప్రైవేట్‌ యాజమాన్యం

చేతులెత్తేసిన విద్యాశాఖ అధికారులు

మూడో విడత అంటూ ప్రభుత్వం గారడీ

తిరుపతి సిటీ : నిర్బంధ ఉచిత విద్యాహక్కు చట్టం ( ఆర్‌టీఈ) ప్రైవేటు పాఠశాలలో అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులతో కూటమి సర్కారు వారి భవిష్యత్తుతో ఆటలాడుతోంది. పేద పిల్లలకు ప్రైవేట్‌ తమ కార్పొరేట్‌ పాఠశాలలో ప్రవేశాలను ఆశ చూపి చేతులెత్తేసింది. ఇప్పటికే రెండు విడతల అడ్మిషన్లు పూర్తయ్యాయని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం వాస్తవ గణాంకాలను చూస్తే విస్తుపోవాల్సిందే.!

జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ విషయంపై పట్టించుకున్న పాపాన పోలేదు. తమ మాట ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల యాజమాన్యాలు వినడం లేదని, తమకు ఏం చేయాలో అర్థం కావడంలేదని అధికారులు మదనపడుతున్నారు.

మాట వినని ప్రైవేటు యాజమాన్యాలు

జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలో కనీసం (ఆర్టీఈ) కింద పేద విద్యార్థుల అడ్మిషన్లు 2శాతం మించలేదంటే అతిశయోక్తి కాదు. జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు పలుమార్లు ప్రైవేటు యాజమాన్యాలతో జరిపిన చర్చలు పూర్తి స్థాయిలో విఫలమయ్యాయి. ఈ ప్రతిపాదనను తాము అంగీకరించమంటూ బహిరంగంగానే అధికారులు, రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే అడ్మిషన్లు తక్కువై నష్టాలతో కళాశాలలు, పాఠశాలలు నడుపుతున్నామని ప్రైవేటు యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఉచితంగా 25 శాతం అడ్మిషన్లు ప్రభుత్వం తమపై రుద్దడం కక్ష సాధింపులో భాగమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రైవేటు యాజమాన్య సంస్థలు రాష్ట్రస్థాయి అధికారులతోనూ ప్రజాప్రతినిధులతోనూ చర్చించినట్లు తెలుస్తోంది.

ముందస్తుగా ఆదేశాలు జారీ చేసినా..

రాష్ట్ర ప్రభుత్వం (ఆర్టీఈ) ప్రతి ప్రైవేటు పాఠశాలలో 25శాతం పేద విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించాలని మే నెల నుంచి జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి పలు విడతలుగా విద్యాశాఖ అధికారులు ప్రైవేటు కళాశాలల యాజమాన్యంతో చర్చలు జరిపినా కనీసం రెండు శాాతం అడ్మిషన్లూ చేయలేకపోయారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. తొలి విడత అడ్మిషన్ల ప్రక్రియ జూన్‌ 12న ప్రారంభమైన ఆ నెలలో కనీసం ఒక్క శాతం కూడా ప్రవేశాలు చేయలేకపోవడం గమనార్హం. అనంతరం రెండో విడత జులై నెలలో ప్రారంభమైనా... రెండు శాతానికి సైతం చేరుకోలేకపోయారు. దీంతో ఇచ్చిన టార్గెట్‌ పూర్తి చేయలేక జిల్లా విద్యాశాఖ యంత్రాంగం చేతులెత్తేసింది.

మూడో విడత అంటూ హంగామా

ఆర్టీఈ కింద పేద విద్యార్థులకు కార్పొరేట్‌ పాఠశాలలలో అడ్మిషన్లు అంటూ హంగామా చేసి రెండు నెలలు గడుస్తున్నా ఆ స్థాయిలో అడ్మిషన్లు జరగకపోవడంతో ప్రభుత్వం మరో ఎత్తుగడకు తెరతీసింది. ఇందులో భాగంగా ఐదు రోజుల క్రితం మూడో విడత అడ్మిషన్లు అంటూ ప్రత్యేక జీవో జారీ చేసింది. జిల్లాస్థాయి అధికారులు మూడో విడత అడ్మిషన్లను వందశాతం పూర్తి చేయాలని టార్గెట్‌ ఇచ్చింది. ఇందులో మరో మెలిక పెట్టింది.. ఆర్టీఈ కింద విద్యార్థుల గృహాలకు 3 కిలోమీటర్ల పరిధి నుంచి 5 కిలోమీటర్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

జిల్లా సమాచారం

జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు – 689

ఇప్పటి వరకు ఆర్టీఈ కింద జరిగిన అడ్మిషన్ల శాతం 2 శాతం

జీరో శాతం అడ్మిషన్‌ ఇచ్చిన ప్రైవేటు సంస్థల సంఖ్య– 601

మూడో విడతకు సంసిద్ధత తెలిపిన ప్రైవేటు పాఠశాలలు– 0

తల్లికి వందనం డబ్బులు కట్టాల్సిందే..

మూడో విడత అడ్మిషన్‌లో భాగంగా (ఆర్టీఈ) కింద ప్రైవేటు పాఠశాలలలో అడ్మిషన్లు పొందే విద్యార్థులు తల్లికి వందనం కింద ప్రభుత్వం చెల్లించిన సొమ్మును ఆ పాఠశాలలకు చెల్లించాల్సిందేనంటూ ఆ ఉత్తర్వులులో ప్రభుత్వం పేర్కొన్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం కల్పించిన ఉచిత ప్రవేశాలపై మొగ్గు చూపడం లేదు. ఇటు తల్లిదండ్రులు– అటు ప్రైవేటు పాఠశాలలు యాజమాన్యం అధికారుల సూచనలు పాటించకపోవడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు ఏమి చేయలేని దుస్థితిలో తలలు పట్టుకుంటున్నారు. మూడో విడత అడ్మిషన్లను ప్రైవేటు పాఠశాలలు కనీసం ఒక శాతం సైతం ఇచ్చే పరిస్థితుల్లో లేవని అధికారులు గుసగుసలాడుకుంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు అధికారులను బెంబేలెత్తిస్తోంది.

ఇంకా ఎటువంటి ఆదేశాలు అందలేదు

ప్రైవేటు పాఠశాలలలో ఆర్టీఈ కింద మూడో విడత అడ్మిషన్ల ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి స్పష్టమైన ఆదేశాలు అందలేదు. అందిన వెంటనే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యంతో సంప్రదించి అడ్మిషన్ల ప్రక్రియపై ముందడుగు వేస్తాం. ప్రభుత్వ ఆదేశాలను దిక్కరించిన ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకునే దానికి వెనుకాడం – కేవీఎం కుమార్‌, జిల్లా విద్యాశాఖ అధికారి, తిరుపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement