
రెచ్చిపోతున్న జన సైనికులు
● చోట లీడర్ల ఇష్టారాజ్యం ● హెచ్చుమీరుతున్న దౌర్జన్యం ● ప్రతిపక్ష పార్టీ నాయకులే లక్ష్యం ● బహిరంగంగానే దాడులకు యత్నం
సాక్షి టాస్క్‌ఫోర్స్ : జనసైనికుల రౌడీయిజానికి అంతే లేకుండా పోతోంది. వారే రౌడీయిజం చేసి మరొకరిపైకి నెట్టేస్తున్నారు. తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట పరిసర ప్రాంతాల్లో ఇటీవల చోటు చేసుకుంటున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం.
జనసేన పార్టీలోని కొందరు పెద్దల ప్రోత్సాహంతో తిరుపతిలో చోటా లీడర్లు హద్దులు మీరి రౌడీయిజం ప్రదర్శిస్తున్నారనే అంశం బాహాటంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీ నాయకులే లక్ష్యం చేసుకుని హెచ్చుమీరి దౌర్జన్యకాండకు దిగుతున్నారు.
తాజాగా గురువారం తిరుపతిలో జనసేన పార్టీకి సంబంధించిన చోటా నాయకుడు దినేష్ ఓ గిరిజన యువకుడిపై దాడికి పాల్పడిన ఘటన సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. బెడిసికొట్టిన కూటమి వ్యూహం..పులిచెర్ల మండలానికి చెందిన పవన్ అనే గిరిజన యువకుడిపై జరిగిన దాడిని తెలివిగా కూటమి నేతలు తమ అనుకూల మీడియా ద్వారా నానా యాగి చేసి ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్‌రెడ్డిపైకి నెట్టేశారు. పోలీసులు కూడా తానా తందానా అంటూ వంతపాడారు. దాడి చేసిందెవరు, ఎందుకు చేశారనే పూర్వా పరాలు తెలుసుకోకుండానే బహిరంగ ఆరోపణలు చేశారు.
అనుకున్నది ఒకటి..జరిగింది.. మరొకటి
గిరిజన యువకుడు పవన్‌పై జనసేన చోటా నాయకుడు దినేష్ పోలీసులు ఉపయోగించే ఫైబర్ లాఠీ చేతపట్టి చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ కావడంతో అది పరిశీలించిన కూటమి నేతలు ఖంగుతిన్నారు. ఏదో అనుకుంటే మరేదో జరిగిందని సాయంత్రానికి ఏమి తెలియనట్లు వ్యవహరించిన తీరుతో వారి బండారం వెలుగుచూసింది.
ఆర్థిక లావాదేవీల వివాదం...
బాధితుడు పవన్, జనసేన చోటా నాయకుడు దినేష్ మధ్య ఆర్థిక లావాదేవీల వివాదం తీవ్ర తరం కావడంతోనే దాడికి దారి తీసిందనే విషయాలు వెలుగు చూశాయి. కాగా వైఎస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా ఉపాధ్యక్షుడు అనిల్‌రెడ్డి టూవీలర్ రెంటల్ బిజినెస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో పులిచెర్లకు చెందిన పవన్ టూవీలర్ రెంట్‌కు తీసుకుని నెలలు గడచినా కనిపించలేదు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పవన్ అనిల్‌రెడ్డి కార్యాలయానికి చేరుకుని బైక్ డబ్బులు పూర్తిగా చెల్లిస్తానని చెప్పుకొచ్చాడు. పవన్ వచ్చిన విషయం తెలుసుకున్న జనసేన కార్యాకర్త దినేష్ అనుచరులతో కలిసి అనిల్‌రెడ్డి కార్యాలయానికి చేరుకున్నారు. పవన్ ఉద్యోగాలు ఇప్పిస్తానని, శ్రీవారి దర్శనాలు చేయిస్తానని డబ్బులు వసూళ్లు చేసుకుని పారిపోయాడని, ఇన్నాళ్లకు చిక్కాడని పవన్‌పై దాడికి తెగబడ్డారు. అనిల్‌రెడ్డి స్పందించి కొట్టొదని దినేష్ తెచ్చుకున్న లాఠీని పట్టుకున్నారు. పట్టుకున్న వీడియోని కట్‌చేసి అనిల్‌రెడ్డే దాడిచేశారని ఎల్లో మీడియా దుష్ప్రచారం చేసింది. కొట్టకుండా అడ్డుకున్న వ్యక్తిపై కేసుపెట్టి జైలుకు పంపిన ఘనత తిరుపతి కూటమి నేతలకే దక్కింది. పూర్వాపరాలు విచారించకుండా పోలీసులు కూడా కూటమి నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అనిల్‌రెడ్డిపై కేసునమోదు చేసి జైలుకు పంపించారు.
హెచ్చుమీరిన దౌర్జన్యాలు ఇలా..
ఇటీవల తిరుపతి, రేణిగుంట పరిధిలో జనసేనకు సంబంధించిన కొందరు బడా, చోటా నాయకుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. తిరుపతి నగరంలో జనసేన పార్టీకి చెందిన కొందరు చోటా లీడర్లు చిరు వ్యాపారులపై పడ్డారు. కమిషన్లు ఇవ్వాలంటూ హుకుం జారీ చేస్తూ ప్రశ్నించే వారిపై దౌర్జన్యాలకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. ఆరు నెలల కిందట బైరాగి పట్టెడ బాబు జగజ్జీవన్ పార్కు సమీపంలో చిరు వ్యాపారుల నుంచి కమీషన్ల తీసుకునే క్రమంలో ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న వివాదంలో కమ్యూనిస్టుల జోక్యం అనివార్యమైంది. అలాగే మంగళం రోడ్డులోని బొంతాలమ్మ గుడి సమీపంలోని చిరు వ్యాపారులు కమీషన్లు చెల్లించాలనే నిబంధనపై ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న వివాదం తార స్థాయికి చేరి ఘర్షణకు దారితీసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందరికి తెలిసి కొన్ని అయితే తెలియకుండా ఇలాంటి ఘటనలు మరెన్నో చోటుకుంటున్నా బాహాటంగా చెప్పుకోలేని స్ధితిలో కొందరు ఉన్నారు.
రేణిగుంటలో బడా నాయకుల బరితెగింపు
నెల రోజుల కిందట రేణిగుంటలో జనసేన బడా నాయకుల బరి తెగింపునకు ఏకంగా ఓ యువకుడు ప్రాణం కోల్పోయాడు. గత నెల 7న జనసేన శ్రీకాళహస్తి ఇంచార్జ్ వినూత డ్రైవర్ శ్రీనివాస అలియాస్ రాయుడు హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి చైన్నె పోలీసుల విచారణలో 5 మంది అరెస్టు అయ్యారు. వీరిలో కోట చంద్రశేఖర్, షేక్ తాసర్, కోట వినుత, శివకుమార్, గోపి ఉన్నారు. ఇలా తిరుపతి జిల్లా పరిధిలోని ప్రధాన పట్టణాల్లో జనసేన శ్రేణులు రెచ్చిపోతున్నారు. అటువంటి వారిపై దృష్టి సారించాల్సిన పోలీసులు సంబంధం లేని వ్యక్తులపై కేసులు నమోదు చేయడాన్ని స్థానికులు తప్పుబడుతున్నారు.