
నేడు మహతిలో పౌరాణిక, సాంఘిక నాటికల ప్రదర్శన
తిరుపతి కల్చరల్: మహతి కళాక్షేత్రంలో శనివారం పౌరాణిక, సాంఘిక నాటికల ప్రదర్శనలకు కళాకారులు, కళాభిమానులు, ప్రజలు హాజరై వీక్షించాలని సుబ్బరాజు నాట్య కళా పరిషత్ అధ్యక్షుడు కోనేటి సుబ్బరాజు పిలుపునిచ్చారు. ప్రకాశం రోడ్డులోని ఆ సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం నాటక తరంగానికి పూర్వవైభవం తేవాలనే సంకల్పంతో అధునాతన హంగులతో కూడిన సెట్టింగ్స్‌తో నాటకాలను గ్రామీణ ప్రాంతాల్లో ప్రదర్శిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో మహతిలో శనివారం సాయంత్రం 4.30 గంటలకు ‘అహో..ఆంధ్రభోజ’ పద్య నాటకం, రాత్రి 8 గంటలకు విశాఖ భద్రం ఫౌండేషన్ సమర్పణలో ‘ దొందూ... దొందే’ సాంఘిక నాటిక ప్రదర్శించనున్నట్టు తెలియజేశారు. సమావేశంలో పరిషత్ ఉపాధ్యక్షులు ఆమూరి సుబ్రమణ్యం, కె.రాధాకృష్ణ, సంయుక్త కార్యదర్శులు చంద్రబాబు, మేకల గంగయ్య, కోశాధికారి బి.గోపాల్, హారిక, కేశవులు పాల్గొన్నారు.