
ఇంజినీరింగ్ ఉద్యోగాలకు 37,121 దరఖాస్తులు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలోని 57 ఉద్యోగాలకు సంబంధించి 37,121 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికి ప్రశ్నపత్రం ద్వారా పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపట్టే దిశగా చర్యలు తీసుకోనున్నారు. అదేవిధంగా టీటీడీలోని కీలక విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేసే విషయంలో రెగ్యులర్, తాత్కలిక డెప్యూటేషన్ పద్ధతిపై ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా నియమించిన కమిటీ సమర్పించిన నివేదిక ద్వారా ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. స్వీమ్స్ ఆస్పత్రిలో 128 మంది పారామెడికల్ సిబ్బందితో పాటు రిజిష్టార్, ఇతర విభాగాల అధికారుల నియామకానికి టీటీడీ అధికార యంత్రాంగం నిర్ణయించింది.
అంగన్‌వాడీ పనితీరు భేష్
రేణిగుంట: మండలంలోని విప్పమాను పట్టెడ పంచాయతీలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని గురు వారం రాష్ట్ర ఫుడ్ కమిషనర్ గంజిమల దేవి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆహార పదార్థాలు, బాలామృతం, పిల్లలు హాజరు పట్టికను తనిఖీ చేశారు. చిన్నపిల్లల తల్లులు, గర్భిణులు, పిల్లలతో ముఖాముఖీ నిర్వహించారు. వారికి అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. అంగన్‌వాడి కేంద్రం అభివృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేసి సర్పంచ్ లక్ష్మీపతిరెడ్డిని అభినందించారు. ఇలాంటి మోడల్ అంగన్‌వాడీ సెంటర్‌ను రాష్ట్రంలోనే మొదటిసారి చూశానని ఇలాంటి సౌకర్యాలున్న కేంద్రం అంగన్‌వాడీ పిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని కొనియాడారు. అనంతరం పక్కనే ఉన్న పాఠశాలల సందర్శించి పిల్లలతో మమేకమై చర్చించి, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీపతిరెడ్డి, సీడీపీఓ కృష్ణవేణి, వైద్యశాఖ సూపర్‌వైజర్ కామరాజు, అంగన్‌వాడీ కార్యకర్త కోకిల, వెల్ఫేర్ రాణి తదితరులు పాల్గొన్నారు.
కంటైనర్ దగ్ధం
రేణిగుంట: మండలంలోని మర్రిగుంట కూడలిలో గురువారం తెల్లవారుజామున కంటైనర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఆపై అగ్నికి ఆహుతయ్యింది. ఈ ఘటనలో సుమారు పది లక్షల రూపాయల విలువ చేసే వస్తువులు కాలిబూడిదయ్యాయి. గాజులమండ్యం ఎస్‌ఐ సుధాకర్ కథనం మేరకు.. శ్రీసిటీ నుంచి బెంగళూరుకు వివిధ రకాల వస్తువులతో వెళ్తున్న కంటైనర్ అదుపుతప్పి బోల్తా పడింది. అదే సమయంలో వ్యవసాయ మార్కెట్ సిబ్బందికి చెందిన ద్విచక్ర వాహనం పై కంటైనర్ పడడంతో రెండు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.
సెప్టెంబర్ 13న
జాతీయ లోక్ అదాలత్
తిరుపతి లీగల్: రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఆదేశాల మేరకు తిరుపతిలో సెప్టెంబర్ 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించనున్నట్టు తిరుపతి మూడో అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ ఎం.గురునాథ్ గురువారం మీడియాకు తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 18వ తేదీ నుంచి తిరుపతిలో ప్రతి కోర్టులో ఫ్రీ లోక్ అదాలత్ సిటింగ్‌లను నిర్వహించనున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆయా కోర్టుల న్యాయమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని, కేసులను రాజీ చేస్తారని తెలిపారు.

ఇంజినీరింగ్ ఉద్యోగాలకు 37,121 దరఖాస్తులు