
దేశంలో వెంకటగిరి చేనేత చీరకు ప్రత్యేకత
వెంకటగిరి రూరల్: వెంకటగిరి చేనేత చీరకు దేశంలో ఓ ప్రత్యేకత ఉందని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని వెంకటగిరిలో గురువారం నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతోకలసి పాల్గొన్నారు. తొలుత క్రాస్‌రోడ్డు వద్ద విద్యార్ధులతో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణలు ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం పద్మశాలి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేతల సదస్సులో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ వెంకటగిరి చేనేత చీరలకు ఇతర రాష్ట్రాలతోపాటు దేశంలో అరుదైన గౌరవం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక ప్రొడక్టర్ అవార్డుల్లో దేశంలోనే వెంకటగిరి చీరకు బంగారు పథకం అర్హత పొందిందన్నారు. కేంద్ర పరిశ్రమ శాఖ మంత్రి పియాష్ గోషాల్ చేతుల మీదుగా తాను స్వయంగా బంగారు పథకం స్వీకరించినట్లు తెలిపారు. జిల్లాలో ఆరువేల పైగా చేనేత కుటుంబాలున్నాయని ముఖ్యంగా వెంకటగిరి, శ్రీకాళహస్తి, గూడూరు, నారాయణవనంలో ఉన్నారన్నారు. ఇందులో వెంకటగిరి పట్టు, జరీ, కాటన్, జందానీ చీరలు ప్రసిద్ధి చెందాయన్నారు. నారాయణవనంలో పెళ్లి పట్టుచీరలు, పుత్తూరులో టవల్స్, దోతీలు బాగా ప్రసిద్ధి చెందాయన్నారు. వెంకటగిరి పట్టణానికి చెందిన లక్కా శ్రీనివాసులు ప్రతిష్టాత్మకమైన సంతకబీర్ అవార్డుకు ఎంపిక అకావడం గర్వకారణంగా ఉందన్నారు. వెంకటగిరిలో 7 చేనేత సంఘాలు యాక్టివ్‌లో ఉండగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో పీఏం ముద్ర యోజన పథకం ద్వారా 148 చేనేత కార్మికులకు రుణాలు ఇచ్చామన్నారు. వెంకటగిరిలో రూ. 1.52 కోట్లతో పోలేరమ్మ చేనేత క్లస్టర్, శ్రీకాహస్తిలో రూ. 90 లక్షలతో శ్రీకాళహస్తి స్మాల్ క్లస్టర్, నారాయణ వనంలో రూ. కోటితో నారాయణ వనం స్మాల్ క్లస్టర్స్ మంజూరు చేసినట్లు తెలిపారు. అనంతరం చేనేతలతోకలసి రూ.60 లక్షల ముద్ర వీవర్స్ చెక్కు ను ఆవిష్కరించారు. హ్యాడ్‌లూమ్ ఏడీ రమేష్, ఎల్‌డీఎం గుంటూరు రవికుమార్ పాల్గొన్నారు.

దేశంలో వెంకటగిరి చేనేత చీరకు ప్రత్యేకత