
రసాభాసగా ఓజిలి టీడీపీ అధ్యక్షుడి ఎన్నిక
నాయుడుపేటటౌన్: పట్టణంలో జరిగిన టీడీపీ మండల అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ రసాభసగా మారింది. పట్టణంలోని శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డు సమీపంలోని శ్రీనివాస కల్యాణ మండపంలో గురువారం సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అధ్యక్షతన నియోజవర్గ పార్టీ పరిశీలకులు జెడ్ శివప్రసాద్ సారధ్యంలో టీడీపీ ఓజిలి అధ్యక్ష ఎన్నిక ప్రక్రియకు సంబంధించి మండల నాయకులు సమక్షంలో పార్టీ అధ్యక్షుల పేర్లను ప్రతిపాదించే ప్రక్రియ ప్రారంభించారు. కొద్ది సేపటికే ఎమ్మెల్యే, టీడీపీ పరిశీలకుల సమక్షంలోనే ఓజిలి మండలానికి చెందిన కొంత మంది నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి, ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ వాగ్వాదానికి దిగారు. ఓజిలి మండలంలో టీడీపీలో ఎప్పుటి నుంచో ఉంటున్న నాయకులకు కాకుండా కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని పెద్ద ఎత్తున వాగ్వాదానికి దిగారు. ఇప్నటి వరకు పార్టీ ఓజిలి మండల అధ్యక్షుడిగా ఉన్న విజయకుమార్ నాయుడుతో పాటు పలువురు నాయకులు ఎంత సర్ధి చెబుతున్నా కొంత మంది నాయకులు ససేమీరా అంగీకరించకుండా చొక్కాలు పట్టుకుని, కుమ్మలాటకు దిగారు. చివరకు నాయుడుపేట అర్బన్, రూరల్ సీఐలు బాబి, సంగమేశ్వరరావు, ఎస్‌ఐలు అదిలక్ష్మి, నాగరాజు నాయకులను పక్కకు తీసుకెళ్లి వివాదం సద్దుమణిగేలా చర్యలు చేపట్టారు. అనంతరం ఓజిలి మండలంతోపాటు పెళ్లకూరు, నాయుడుపేట రూరల్, పట్టణ పార్టీ అధ్యక్షులకు సంబంధించి ఆఽశావాహుల పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రతిపాదించిన పేర్లను పార్టీ అధిష్టానికి పంపి, అక్కడ నుంచి కమిటీ పేర్లు ప్రకటించం జరుగుతుందని ఎమ్మెల్యే విజయశ్రీ స్పష్టం చేశారు.
● ఎమ్మెల్యే విజయశ్రీ ఎదుటే టీడీపీ నేతల కుమ్ములాట

రసాభాసగా ఓజిలి టీడీపీ అధ్యక్షుడి ఎన్నిక