
జాతీయ రహదారులు నిర్మించాలి
● పార్లమెంట్‌లో ఎంపీ మద్దిల గురుమూర్తి
తిరుపతి మంగళం : పార్లమెంట్ నియోజకవర్గంలో జాతీయ రహదారులను నిర్మించాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. గురువారం పార్లమెంట్‌లో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రహదారుల పరిస్థితిని ఆయన కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. జాతీయ రహదారి–16పై సూళ్లూరుపేట వద్ద, జాతీయ రహదారి –716 పై కరకంబాడి వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం గతంలో ఇచ్చిన విజ్ఞప్తులపై కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యల వివరాలు తెలపాలని కోరారు. శ్రీకాళహస్తి–తడ, గూడూరు–రాపూరు–రాజంపేట, ఊతుకోట–తడ రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చమని అభ్యర్థిస్తూ ప్రభుత్వానికి వినతులు అందాయా? అలా అయితే సాధ్యాసాధ్యాల అధ్యయన వివరాలు, బడ్జెట్ కేటాయింపుల వివరాలు తెలపాలన్నారు. ఇదే అంశాలపై గతంలో కేంద్ర మంత్రికి పలుమార్లు ఎంపీ విజ్ఞప్తి చేశారు. దీంతో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు జాతీయ రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. జాతీయ రహదారి–16పై సూళ్లూరుపేట షార్ సర్కిల్ వద్ద కి.మీ 81.050 వద్ద రోటరీ జంక్షన్, పాదచారుల కోసం కిమీ 80.970 వద్ద ఇప్పటికే అండర్‌పాస్‌లను అభివృద్ధి చేసినట్లు మంత్రి గడ్కరీ వెల్లడించారు. ఇవి తడ–నెల్లూరు వరకు ఉన్న జాతీయ రహదారి నాలుగు లైన్ల ప్రాజెక్టులో భాగంగా పూర్తయ్యాయని తెలిపారు. కరకంబాడి వద్ద చిన్నఒరంపాడు నుంచి రేణిగుంట జాతీయ రహదారి 716 నిర్మాణంలో భాగంగా రెండు ముఖ్యమైన అండర్ పాస్‌ల నిర్మాణం జరుగుతుందని మంత్రి తెలిపారు. కి.మీ 118.057 వద్ద కరకంబడి రైల్వే క్రాసింగ్ దగ్గర లైట్ వెహికల్ అండర్‌పాస్, కి.మీ 118.885 వద్ద కట్టపుట్టాలమ్మ ఆలయం సమీపంలో వెహికల్ అండర్‌పాస్ నిర్మించనున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టును 28 జనవరి 2025న కాంట్రాక్ట్ ద్వారా అప్పగించారన్నారు. ఈ పనులు మొదలయ్యాక తరువాత రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.