
రోడ్డు మరమ్మతు చేయాలని నిరసన
● టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు ● రోడ్డుకు అడ్డంగా ఫెన్సింగ్ రాళ్లు నాటిన గ్రామస్తులు
బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని ఆలత్తూరు–కేటీ రోడ్డు అధ్వాన్నస్థితి చేరుకోవడంతో మరమ్మతులు చేయాలని గురువారం గ్రామస్తులు నిరసన తెలిపారు. కంకర తీసుకెళుతున్న టిప్పర్లను నిలిపి, రోడ్డుకు అడ్డంగా ఫెన్సింగ్ రాళ్లు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోడ్డు వెంబడి రాళ్ల క్రషర్లు, క్వారీలు ఉన్నాయని, క్రషర్లు, క్వారీల నుంచి టిప్పర్లు 50 టన్నులకుపైగా బరువున్న కంకర తీసుకుపోతున్నారని తెలిపారు. రహదారిలో రోజుకు 200పైగా లారీలు 50 టన్నుల ఓవర్‌లోడ్‌తో రోడ్డుపై తిరుగుతున్నాయని, వాటిని అరికట్టాల్సిసిన మైనింగ్ అధికారులు మామ్ముళ్ల మత్తులో జోగుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సంక్రాంతికి రోడ్లుకు మరమ్మతులు చేస్తామని ప్రగల్భాలు పలికిన కూటమి ప్రభుత్వం అసంగతి మరచిపోయిందని విమర్శించారు. రోడ్డు మరమ్మతు చేయాలని పలుసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. సంబంధితశాఖ ఉన్నతాధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని, లేకుంటే కేటీ రోడ్డుపై రాస్తారోకో చేస్తామని హెచ్చరించారు. వేణుగోపాల్‌రెడ్డి, యనమలప్రసాద్‌పాల్, చిన్నికృష్ణ, లక్ష్మీనారయణ, చెంచమ్మ, సుధీర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.