తిరుపతి రూరల్: ‘అమ్మా.. చాముండేశ్వరీ..కుటమి సర్కారు కుట్రల నుంచి చెవిరెడ్డిని కాపాడు తల్లీ.. నీ బిడ్డ చెవిరెడ్డిని తప్పుడు కేసులో నిర్బంధించి జైలులో పెట్టారు.. ఆయన ఆరోగ్యం కాపాడి త్వరగా బయటకు వచ్చేలా అనుగ్రహించు తల్లీ..’ అంటూ వైఎస్సార్ సీపీ చంద్రగిరి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అమ్మవారిని ప్రార్థించారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట సమీపంలోని శ్రీశక్తి చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో బుధవారం చెవిరెడ్డి పేరిట అర్చన చేయించి, అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం ఆలయం ఎదుట అమ్మవారికి 216 కొబ్బరికాయలు కొట్టి తమ నాయకుడు చెవిరెడ్డి త్వరగా బయటకు రావాలని ప్రార్థించారు. అనంతరం వైఎస్సార్ సీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ తప్పుడు కేసులో చెవిరెడ్డిని నిర్భందించి 50 రోజులు గడిచిపోయాయని, ఆయన ఆరోగ్యం బాగుండాలని, త్వరగా బెయిల్‌పై విడుదల కావాలని అమ్మవారిని ప్రార్థించామన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యా లు, దాడుల నుంచి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. చెవిరెడ్డిని విడుదల చేసేంత వరకు తాము పోరాడుతూనే ఉంటామని, ఈ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగడతామని హెచ్చరించారు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ వెళ్లి చెవిరెడ్డిపై పెట్టిన అక్రమ కేసును వివరించి కూటమి పెద్దల కుట్రలు బయటపెడతామన్నారు.
చెవిరెడిపై తప్పుడు కేసు
అక్రమ నిర్బంధానికి 50 రోజులు
బెయిల్ రావాలని కోరుతూ కొబ్బరికాయలు కొట్టిన నేతలు
కాపాడినందుకు.. కటకటాలకు పంపించారా.?
‘కరోనా సమయంలో రక్త సంబంధీకులు సైతం దూరంగా వెళ్లి తలుపులు మూసుకుంటే.. ప్రతి ఇంటి తలుపు తట్టి ఒక ఆత్మబంధువులా అందరినీ కాపాడిన వ్యక్తి చెవిరెడ్డి. టీడీపీ వారిని సైతం కాపాడినందుకు ఆయన్ని కటకటాలకు పంపించారా..? పార్టీలు చూడకుండా ఎంతో మంది టీడీపీ నేతలకు సాయం చేసినందుకు జైలుకు పంపారా..? కూటమి పెద్దలు సమాధానం చెప్పాలి.’ అని వైఎస్సార్‌సీపీ తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు కొత్తపాటి మునీశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, సర్పంచ్‌లు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, రాష్ట్ర పార్టీ నాయకులు, జిల్లా పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నేతలు, జగనన్న అభిమానులు పాల్గొన్నారు.