
ఆర్టీసీ ఆస్తులు ప్రైవేటీకరణ సరికాదు
తిరుపతి అర్బన్: ఎంతో విలువైన ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటీకరణ చేయడం సరికాదని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా కార్యదర్శి బీఎస్ బాబు పేర్కొన్నారు. డీపీటీఓ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. విజయవాడలోని గవర్నర్‌పేట–2 డిపోకు చెందిన 4.15 ఎకరాల భూమిని లులూ అనే ప్రైవేటు సంస్థకు కట్టబెట్టడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఉన్నతాధికారులు ఏక పక్షంగా ఇలా జీఓలు ఇవ్వడం మానుకోవాలని చెప్పారు. గవర్నర్‌పేట–2 డిపో స్థలం విలువ రూ.400 కోట్లు ఉంటుందన్నారు. ఇలా ఒక్కొక్కటిగా ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లోనూ ఈ నెల 12, 13 తేదీల్లో ఎన్‌ఎంయూ ఆధ్వర్యంలో ధర్నాలు చేయనున్నామన్నారు.