
మట్టి వినాయక విగ్రహాలకే అనుమతి
తిరుపతి అర్బన్: వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని.. అయితే మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయడానికి మాత్రమే అనుమతి ఉంటుందని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం తిరుపతి నగర వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లపై అధికారులు సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తోపాటు ఎస్పీ హర్షవర్థన్‌రాజు, జేసీ శుభం బన్సల్, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, డీఆర్వో నరసింహులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతిలో టీటీడీ సహకారంతో మున్సిపల్ కార్పొరేషన్ వారు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. భారీ విగ్రహాలను ఏర్పాటు చేయకూడదని స్పష్టం చేశారు. నిమజ్జనం రోజు మత్స్యశాఖ వారు గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కోలాటం, భజన కార్యక్రమాలతోపాటు భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించాలని సూచించారు.వినాయకసాగర్, దామినేడు వద్ద నిమజ్జనంలో ఎలాంటి అపశృతులు జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ అగ్నిమాపక, విద్యుత్, పోలీస్, మున్సిపల్ అధికారులు ఒకే వేదికపై కూర్చునేలా ఏర్పాట్లతో పర్మిషన్లు త్వరితగతిన ఇచ్చేలా చూడాలని వెల్లడించారు. మద్యం సేవించకూడదని, మందిరాల వద్ద భక్తి పాటలు మాత్రమే పెట్టాలని ఆదేశించారు. వివాదాలకు తావులేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 50 అడుగుల బారీ నాట్య వినాయకుని విగ్రహాన్ని వినాయక సాగర్‌లో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘు వాన్షి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, గూడూరు ఆర్డీఓలు భానుప్రకాష్, కిరణ్మయి, రాఘవేంద్ర మీనా, అదనపు ఎస్పీ రవి మనోహర ఆచారి, జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవి, తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాసులు, మహోత్సవ కమిటీ సభ్యుడు భానుప్రకాష్, తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.