
అన్నదాతకు తప్పని ఆందోళన
● బాబు పాలనలో రోడ్డున పడిన రైతులు ● ఒక వైపు ఎరువుల కొరత.. మరోవైపు లేని గిట్టుబాటు ధర ● పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందించిన భూమన కరుణాకరరెడ్డి ● ప్రజా సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన ● వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా
తిరుపతి అర్బన్ : చంద్రబాబు ఎన్నికల సమయంలో చెప్పేది ఒకటి.. అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేది మరొకటని, కూటమి పాలనలో రైతులను రోడ్డున పడేశారని వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి మండిపడ్డారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, తిరుపతి మేయర్ శిరీషా, వైఎస్సార్‌సీపీ సత్యవేడు సమన్వయకర్త నూకతోటి రాజేష్, శ్రీకాళహస్తీశ్వర ఆలయ మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బీరేంద్ర వర్మ, తిరుపతి నగర పార్టీ అధ్యక్షుడు మల్లం రవిచంద్ర రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ్ వంశీతో కలసి హాజరయ్యారు. గ్రీవెన్స్‌లో డీఆర్‌ఓ నరసింహులుకు వినతిపత్రం అందించారు. జిల్లాలో ఎరువుల కొరతను వివరించారు. తక్షణం సమస్య పరిష్కరించాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పీజీఆర్‌ఎస్‌లో ఎరువుల కొరతపై వినతిపత్రం ఇచ్చామన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు పెట్టుబడి సాయంగా ఒక్కో రైతుకు రాష్ట్రం తరఫున రూ.20వేలు అందిస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. ఇప్పుడు కేంద్రం మూడు విడతల్లో రూ.6వేలు ఇస్తుందని, రాష్ట్రం రూ.14 వేలు మాత్రమే భరిస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అదీ ఏడాది తర్వాత రైతులకు కేవలం రూ.5వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. దీనికితోడు కుంటి సాకులతో రాష్ట్రవ్యాప్తంగా 7లక్షల మందికి రైతులకు అన్నదాత సుభీభవ నిధులు జమ చేయకుండా ఎగనామం పెట్టారని ఆరోపించారు. ఈ క్రమంలోనే కాంప్లెక్స్ ఎరువుల కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. ప్రధానంగా యూరియా లేకపోవడంతో అన్నదాతలు నానా కష్టాలు పడుతున్నారని వివరించారు. 13.5లక్షల టన్నుల కాంప్లెక్స్ ఎరువుల అవసరం ఉందని, 2లక్షల టన్నుల నిల్వలను అందుబాటులో ఉంచుకునేందుకు బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయింపు చేయాల్సి ఉండగా, కేవలం రూ.40కోట్లు మాత్రమే కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించలేదని చెప్పారు. తోతాపురి మామిడికి గత వైఎస్సార్‌సీపీ సర్కార్‌లో కేజీకి రూ.29 చొప్పున ఇస్తే.. చంద్రబాబు ప్రభుత్వం రూ.2 ఇవ్వడమే గగనంగా మారిందన్నారు. టమాటాకు ధరలు లేకపోవడంతో రైతులు రోడ్లపై పోయాల్సిన దుస్థితి దాపురించిందని వివరించారు. మిర్చి, పొగాకు పంటలకు గిట్టుబాటు ధరలు లేని వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని వివరించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో విత్తనాలు, ఎరువులు కొరత లేకుండా రైతు భరోసా కేంద్రంలో పంపిణీ చేశామని తెలిపారు. అలాగే క్రమం తప్పకుండా వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని అర్హులైన రైతులు అందరికీ అందించామని వెల్లడించారు. రైతులకు ఉచిత బీమా, ఇన్‌ఫుట్ సబ్సిడీ, వడ్డీలేని రుణాలు అందించిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదే అని కొనియాడారు. వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు మాధవీరెడ్డి, రైతు అనుబంధ సంఘాల జిల్లా నాయకుడు చంద్రమౌళీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భూమనకు సమస్యలు ఏకరవు పెట్టిన జనం
కలెక్టరేట్‌లో భూమన కరుణాకరరెడ్డిని పలువురు అర్జీదారులు కలిశారు. ఆయనకు తమ సమస్యలను ఏకరవు పెట్టారు. ఎన్నిసార్లు అర్జీలు సమర్పించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల సమస్యలపై భూమన స్పందించారు. పరిష్కారం చూపించేందుకు అధికారులతో మాట్లాడతామని భరోసా ఇచ్చారు. భూమనతో అర్జీదారుల ఆవేదన ఇలా..
బాలాయపల్లె మండలంలోని వాక్యం గ్రామానికి చెందిన విజయమ్మ, రాధ,రాజేశ్వరి, రామాదేవి తదితర మహిళా రైతులు తమ ఊరిలో టీడీపీ నేత గెరటయ్య 111 సర్వే నంబర్‌లోని తమ 8.78 ఎకరాల భూమిని ఆక్రమించారని, తమకు న్యాయం చేయాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే అండదండలతోనే కబ్జాకు పాల్పడినట్లు వివరించారు.
ఈ ఏడాది మార్చిలో తన భర్త లక్ష్మన్న మృతి చెందాడని, వితంతు పింఛన్ మంజూరు చేయాలని వస్తే అధికారులు పట్టించుకోవడం లేదని తిరుపతి అర్బన్‌లోని తిరుమల నగర్‌కు చెందిన సుబ్బమ్మ అనే మహిళ వాపోయారు.
తిరుపతి నగరంలోని 3వ వార్డుకు చెందిన ఝాన్సీలక్ష్మీబాయ్ సమాఖ్య పరిధిలో 34 డ్వాక్రా సంఘాలు ఉన్నాయని, అందులో 340 మందిని సభ్యులుగా ఉన్నట్లు పొదుపు మహిళలు తెలిపారు. తమ సొమ్ము రూ.1.20 కోట్లను ఆర్‌పీ లత స్వాహా చేశారని తమకు న్యాయం చేయాలని విన్నవించారు.
పింఛన్ మంజూరు చేయడం లేదని తిరుపతి పద్మానగర్‌కు చెందిన షాజహాన్ అనే దివ్యాంగురాలు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు తిరిగినా ట్రైసైకిల్ ఇవ్వడం లేదని నరసింహారావు అనే దివ్యాంగుడు వాపోయారు.
ఈ సమస్యలపై భూమన స్పందించారు. కలెక్టరేట్‌లో అరగంట ఉంటేనే ఇన్ని సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, అధికారులు నిర్లక్ష్యం వహించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నదాతకు తప్పని ఆందోళన

అన్నదాతకు తప్పని ఆందోళన