
ఆత్మవిశ్వాసంతోనే లక్ష్య సాధన
తిరుపతి కల్చరల్ : ఆత్మవిశ్వాసంతోనే లక్ష్యాలను సాధించవచ్చని, ఆ దిశగా మహిళలు ప్రయత్నించాలని స్విమ్స్ మాజీ డైరెక్టర్ బి.వెంగమ్మ పిలుపునిచ్చారు. రామకృష్ణ మిషన్ ఆశ్రమ దశమ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా రెండో రోజు సోమవారం ఆశ్రమంలోని వివేకానంద సమావేశ మందిరంలో యువజన సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంగమ్మ మాట్లాడుతూ మహిళలకు విద్యావకాశం కల్పించడమే వివేకానందుడి లక్ష్యమని తెలిపారు. జీవన విధానం సమతుల్యంతో సాగాలంటే ఆత్మవిశ్వాసం అవసరమన్నారు. మనసును పాజిటివ్ ఆలోచనలకు అలవాటు చేయాలని కోరారు. అబ్దుల్ కలాం చెప్పినట్లు వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. గౌరవ అతిథి ఎస్వీ వేదిక్ వర్సిటీ వీసీ రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందని తెలిపారు. అనంతరం నెల్లూరు రామకృష్ణ మిషన్ కార్యదర్శి హృదానందజీ మహరాజ్, రుయా అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి.నిర్మల, రామకృష్ణ మిషన్ విజయవాడ సహాయ కార్యదర్శి శితికంఠానందజీ మహరాజ్ మాట్లాడారు. రామకృష్ణ మిషన్ ఆశ్రమ కార్యదర్శి స్వామి సుకృతానంద పాల్గొన్నారు.