వెంకటగిరి పురపీఠం వైఎస్సార్‌సీపీదే..
● మున్సిపల్ చైర్మన్‌పై వీగిన అవిశ్వాస తీర్మానం ● కూటమి కుతంత్రాలకు తలొగ్గని 19 మంది కౌన్సిలర్లు ● గైర్హాజరైన ఆరుగురు ఫిరాయింపుదార్లు ● పురపాలక సంఘం చైర్మన్‌గా నక్కా భానుప్రియ ● టీడీపీ పతనానికి ఇదే నాంది : నేదురుమల్లి
న్యాయమే గెలిచింది
వెంకటగిరిలో న్యాయమే గెలిచిందని, మళ్లీ వైఎస్సార్‌సీపీ జెండానే ఎగుర వేశామని నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఎన్‌జేఆర్ భవనంలో ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, మున్సిపల్ చైర్‌పర్సన్ నక్కా భానుప్రియ, కౌన్సిలర్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. దొడ్డిదారిన పురపాలక పీఠం కాజేయాలని చూసిన కూటమి కుతంత్రాలను సమష్టిగా తిప్పికొట్టామని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ గుర్తుపై 25 మంది కౌన్సిలర్లు గెలిస్తే, ప్రలోభపెట్టి ఆరుగురిని లాక్కున్నారని విమర్శించారు. వెంకటగిరి నుంచే టీడీపీ పతనం ప్రారంభమైందని చెప్పారు. రెడ్‌బుక్ రాజ్యాంగం ఇక్కడ పనిచేయదని, జగన్ రూలింగ్ మాత్రమే నడుస్తుందని వెల్లడించారు. నిజాయితీగా పార్టీకి కట్టుబడిన కౌన్సిలర్లకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు.
వెంకటగిరి(సైదాపురం) : వెంకటగిరి మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేసింది. బుధవారం పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ నక్కా భానుప్రియపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. కూటమి నేతలు అధికారం అండతో ప్రలోభాలకు పాల్పడినా వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు నిజాయితీగా నిలబడ్డారు. వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో 19 మంది కౌన్సిలర్లు కట్టుగా సత్తా చాటారు.
ప్రతిపాదించి.. గైర్హాజరు
వెంకటగిరి మున్సిపాల్టీలో మొత్తం 25 వార్డులు ఉన్నాయి. అన్నింట్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే విజయం సాధించారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరుగురు కౌన్సిలర్లు పార్టీ ఫిరాయించారు. అయినప్పటికీ పురపాలక సంఘంలో వైఎస్సార్‌సీపీకి 19 మంది కౌన్సిలర్ల బలం ఉంది. అయితే కూటమి నేతలు కుట్రపూరితంగా వ్యవహరించి మున్సిపల్ చైర్మన్ నక్కా భానుప్రియపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో కలెక్టర్ ఆదేశాల మేరకు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్రమీనా ప్రిసైడింగ్ అధికారిగా అవిశ్వాస తీర్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీకి చెందిన 19 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన ఫిరాయింపు కౌన్సిలర్లు మాత్రం గైర్హాజరయ్యారు. దీంతో తీర్మానం వీగిపోయినట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. ఈ మేరకు ధ్రువీకరణపత్రం అందించారు. దీంతో మున్సిపల్ చైర్‌పర్సన్‌గా మళ్లీ నక్కా భానుప్రియ పీఠం అధిరోహించారు.
వెంకటగిరి పురపీఠం వైఎస్సార్‌సీపీదే..


