రైల్‌ వన్‌యాప్‌ | - | Sakshi
Sakshi News home page

రైల్‌ వన్‌యాప్‌

Jan 17 2026 11:44 AM | Updated on Jan 17 2026 11:44 AM

రైల్‌ వన్‌యాప్‌

రైల్‌ వన్‌యాప్‌

● రైలు టికెట్‌పై రిబేటు ● 3 శాతం ప్రకటించిన రైల్వే శాఖ ● మార్చి తర్వాత యూటీఎస్‌ రద్దు

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: రైల్వే శాఖ పలు రకాల రైలు సేవలను ఒకే ప్లాట్‌ఫాంపైకి తెచ్చింది. ఇందులో భాగంగా రైలు ప్రయాణికుల మరింత చేరువుగా రైల్‌ వన్‌యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆన్‌లైన్‌ టికెట్లపై 3 శాతం రిబేటు ప్రకటించింది. ఈ యాప్‌ ద్వారా బుధవారం నుంచి టికెట్ల రిబేటు విధానాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. గతంలో అన్‌ రిజర్వ్‌డ్‌ టికెట్ల జారీ కోసం రైల్వేశాఖ పదేళ్ల కిందట అన్‌ రిజర్వడ్‌ టికెట్‌ సర్వీస్‌ (యూటీస్‌) పేరిట ఒక యాప్‌ను లాంచ్‌ చేసింది. ఆ అప్లికేషన్స్‌ రైల్వే శాఖ ప్రచారం చేసినా పూర్తిస్థాయిలో ప్రజాదరణ పొందలేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా వివిధ రైల్వే ఆన్‌లైన్‌ సేవలను ఒక గొడుగు కిందకు తెచ్చే క్రమంలో గత ఏడాది జూలైలో రైల్‌ వన్‌యాప్‌ను ప్రారంభించింది. ఆ యాప్‌ ద్వారా రైలు టికెట్లపై ఎటువంటి డిస్కౌంట్‌ ప్రకటించలేదు. సాధారణ టికెట్ల జారీ ఆప్షన్‌ రైల్‌ వన్‌యాప్‌లో ఉండడంతో యూటీఎస్‌ అవసరం లేకుండాపోయింది. దీంతో మార్చి నుంచి ఆ యాప్‌ రద్దు చేసే యోచనలో రైల్వే శాఖ ఉంది. ఈ మేరకు యూటీఎస్‌ యాప్‌లో ఆన్‌లైన్‌ జనరల్‌ టికెట్‌పై ఇచ్చే 3 శాతం డిస్కౌంట్‌ను రైల్‌ వన్‌యాప్‌లో సంక్రాంతి కానుకగా రైల్వే శాఖ ప్రయాణికులను అందుబాటులోకి తీసుకొచ్చింది.

అన్ని రకాల టికెట్లపై డిస్కౌంట్‌...

యూటీఎస్‌ యాప్‌లో కేవలం అన్‌ రిజర్వ్‌ టికెట్లు జారీ చేసేవారు. అలాగే వ్యాలెట్‌ డబ్బుతో బుక్‌చేసే అన్‌ రిజర్వ్‌ టికెట్లపై మాత్రమే 3 శాతం రిబేటు లభించేది. ప్రస్తుతం రైల్‌ వన్‌ యాప్‌ ద్వారా అన్‌ రిజర్వుడ్‌తో పాటు రిజర్వ్‌ టికెట్లపై కూడా 3 శాతం రిబేటు ఇవ్వడానికి రైల్వే శాఖ అంగీకారం తెలిపింది. రైల్వే శాఖ టికెట్లు జారీ చేసే కమర్షియల్‌ శాఖ సిబ్బందిని, కాంట్రాక్టు, టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లకు తగ్గించే లక్ష్యంతో దశాబ్దం కిందట యూటీఎస్‌ యాప్‌ను రైల్వేశాఖ ప్రవేశపెట్టింది. కేవలం ఈ యాప్‌ అన్‌రిజర్వుడు టికెట్లకే పరిమితం కావడంతో ప్రయాణికులు రిజర్వుడు టికెట్ల కోసం ఆయా రైల్వేస్టేషన్‌లోని పీఆర్‌ఎస్‌ కౌంటర్లకు రావడమో, ఐఆర్‌సీటీసీ, ఇతర ప్రైవేటు ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా టికెట్‌ను బుక్‌ చేసుకోవడం వంటివి చేసేవారు. దీనిని అధిగమిస్తూ రైల్వే శాఖ సరికొత్తగా రైల్‌ వన్‌యాప్‌ను డిజైన్‌ చేసింది. ఇతర సేవలను కూడా దీని ద్వారా ప్రయాణికులకు అందించి ఆదరణ పొందే యత్నంలో భాగంగానే రైల్‌ వన్‌యాప్‌ ద్వారా అన్ని రకాల టికెట్ల బుకింగ్‌పై 3 శాతం డిస్కౌంటును ప్రకటించింది.

బహుళ ప్రయోజనాలు

రెల్‌ వన్‌యాప్‌ ద్వారా రిజర్వ్‌, అన్‌ రిజర్వుడ్‌తోపాటు ప్లాట్‌ఫామ్‌, సీజన్‌ టికెట్లను కూడా ప్రయాణికులు పొందే సదుపాయాన్ని కల్పించారని తిరుపతి రైల్వేస్టేషన్‌ డైరెక్టర్‌ కుప్పాల సత్యనారాయణ వెల్లడించారు. టికెట్లపై రిబేటు మాత్రమే కాకుండా పలు రకాల సేవలను ప్రయాణికులకు చేరువ చేసిందన్నారు. కాగా యూటీఎస్‌ యాప్‌లో అన్‌ రిజర్వుడ్‌ టికెట్లను బుక్‌ చేయాలంటే రైల్వేస్టేషన్‌ వెలుపలే యాప్‌ ఆపరేట్‌ చేయాల్సి ఉంటుంది. రైల్‌ వన్‌యాప్‌ ద్వారా రైల్వే స్టేషన్‌లోనూ టికెట్లను బుక్‌ చేసే వెసులుబాటు కల్పించారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement