వైభవంగా గిరిప్రదక్షిణ
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరస్వామి, అమ్మవార్ల గిరిప్రదక్షిణ శుక్రవారం వైభవంగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో వెలసిన స్వామి అమ్మవార్లకు కల్యాణం నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా స్వామి అమ్మవార్లు ఏటా కనుమ పండుగ రోజు కై లాసగిరి ప్రదక్షిణ చేసి దేవతలు, రుషులను ఆహ్వానిస్తారు. మొదట జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామివారికి ఆలయ అలంకార మండపంలో పలు రకాల అభిషేకాలు చేశారు. అనంతరం విశేష పూజలు నిర్వహించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ ఉత్సవమూర్తులను చప్పరాలపై కొలువుదీర్చి కై లాసగిరి ప్రదక్షిణకు బయలుదేరారు. ఈ సందర్భంగా చతుర్మాడవీధులు శివనామస్మరణలతో మారుమ్రోగాయి. స్వామి అమ్మవార్లు జయరామరావువీధి, కై లాసగిరికాలనీ, రామచంద్రాపురం, రాజీవ్‌నగర్ మీదుగా రామాపురం రిజర్వాయరు సమీపంలోని అంజూరు మండపం వద్దకు చేరుకున్నారు. అక్కడ స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. అక్కడ ఆలయాధికారులు భక్తులకు అన్నదానం చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లు వెయిలింగాలకోన, వేడాం మీదుగా శుకబ్రహ్మాశ్రమం వద్ద ఉన్న ఎదురుసేవ మండపం వద్దకు వేంచేపు చేశారు. ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, పాలకమండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఈఓ బాపిరెడ్డి, పాలకమండలి సభ్యులు, ఆలయాధికారులు పాల్గొన్నారు.
శాస్త్రోక్తంగా పంచమూర్తుల గిరిప్రదక్షిణ
శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరాలయంలో సంక్రాంతిని పురస్కరించుకుని గురువారం శాస్త్రోక్తంగా పంచమూర్తుల గిరిప్రదక్షిణ నిర్వహించారు. స్వామి అమ్మవార్ల గిరిప్రదక్షిణలో భాగంగా పంచమూర్తుల పల్లకిపై కొలువుదీరి గిరిప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం గొబ్బెమ్మకు అలంకార మండపంలో పలు రకాల అభిషేక పూజలు చేసి, విశేషంగా అలంకరించారు. అమ్మవారిని సింహవాహనంపై కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు.
వైభవంగా గిరిప్రదక్షిణ


